తిరుపతి శివార్లలో రెచ్చిపోతున్న తెలుగు తమ్ముళ్లు పంచాయతీ బోరు కబ్జాను అడ్డుకున్నందుకు మెరుపు దాడి | - | Sakshi
Sakshi News home page

తిరుపతి శివార్లలో రెచ్చిపోతున్న తెలుగు తమ్ముళ్లు పంచాయతీ బోరు కబ్జాను అడ్డుకున్నందుకు మెరుపు దాడి

Aug 2 2026 1:58 AM | Updated on Aug 2 2026 1:58 AM

● కళ్లెదుటే దళితులను కొడుతున్నా మౌనం దాల్చిన పోలీసులు ● తిరుపతి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఘటన ● కాలనీ వాసులతో కలసి బోరు వద్ద నిరసన తెలిపిన మాజీ సర్పంచ్‌ ● కబ్జాదారులకు అండగా నిలిచిన తిరుపతి రూరల్‌ పోలీసులు

● కళ్లెదుటే దళితులను కొడుతున్నా మౌనం దాల్చిన పోలీసులు ● తిరుపతి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఘటన ● కాలనీ వాసులతో కలసి బోరు వద్ద నిరసన తెలిపిన మాజీ సర్పంచ్‌ ● కబ్జాదారులకు అండగా నిలిచిన తిరుపతి రూరల్‌ పోలీసులు

బోరుని వదిలేయండి

పంచాయతీ బోరును ఆక్రమించడంపై పలు మార్లు అధికారులకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వినతులు సమర్పించారు. పంచాయతీ అధికారులు కబ్జాదారులకు నోటీసులిచ్చి పంచాయతీ బోరు వద్ద ఎలాంటి ఆక్రమణలు చేయరాదని చెప్పినా వారు వినిపించుకోలేదని, అందుకే బోరును కాపాడుకునేందుకు నిరసన తెలిపినట్టుగా బాధితుడు మాజీ సర్పంచ్‌ వెంకటరమణ స్పష్టం చేశారు. అందుకే తనపై దాడిచేశారని, అంబేడ్కర్‌ బొమ్మను సైతం చించివేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: తిరుపతి రూరల్‌ మండలం, అవిలాల గ్రామ పంచాయతీ, శానప్పకాలనీ సమీపంలోని సర్వే నం.145లో హథీరాంజీ మఠం భూములను కొందరు తెలుగు తమ్ముళ్లు కబ్జా చేసి దర్జాగా షాపింగ్‌ కాంప్లెక్స్‌లను నిర్మిస్తున్నారు. అందులో భాగంగా నిర్మాణంలో ఉన్న కాంప్లెక్స్‌కు ఆనుకుని పంచాయతీ బోరు ఉండగా దానిని కూడా ఆక్రమించేశారు. దీంతో వివాదం చోటు చేసుకుంది. ఆక్రమిత స్థలం నుంచి పంచాయతీ బోరును వదిలేయాలని కబ్జాదారులకు పలు మార్లు పంచాయతీ అధికారులు నోటీసులిచ్చినా లెక్క చేయలేదు. పంచాయతీ బోరు నుంచి నీరు రాకుండా చేశారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ఇది మంచిది కాదంటూ మాజీ సర్పంచ్‌ వెంకటరమణ కాలనీ వాసులతో కలసి శనివారం శాంతి యుత నిరసన చేపట్టారు. పంచాయతీ బోరును కబ్జాదారుల నుంచి కాపాడాలని డిమాండ్‌ చేశారు.

దళితులపై ముప్పేట దాడి

పంచాయతీ బోరు వద్ద నిరసన తెలుపుతున్న విషయం తెలుసుకున్న భూ కబ్జాదారులు రెండు కార్లల్లో వచ్చి ముందుగా అంబేడ్కర్‌ బొమ్మతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చించివేశారు. ఆపై దళిత మహిళలపై బూతుల వర్షం కురిపించారు. విచక్షణా రహితంగా కొట్టి అడ్డొచ్చిన వాళ్లను కాళ్లతో తన్నుకుంటూ పిడిగుద్దులు కురిపించారు. మాజీ సర్పంచ్‌ వెంకటరమణ గొంతు పట్టుకుని నులుముతూ చంపేస్తానని హెచ్చరికలు చేశారు. ప్రాణభయంతో పరుగులు తీసినా వెంటాడి కొట్టారని, ఇదంతా పోలీసులు చూస్తుండగానే జరిగిందని గాయపడ్డ మహిళలు చెబుతున్నారు.

తమ్ముళ్లకు అండగా పోలీసులు

కబ్జాకు పాల్పడిన తెలుగు తమ్ముళ్లకు పోలీసులు అండగా నిలబడ్డారని, అందుకే తిరుపతి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలో పెద్ద ఎత్తున గొడవ జరుగుతున్నా ఆపడానికి రాలేదని, అక్కడ ఉన్న ఓ మహిళా ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా రోడ్డులోకి వెళ్లి నిలుచున్నారే తప్ప అడ్డుచెప్పలేదని దాడిలో గాయపడిన మహిళలు చెబుతున్నారు. పోలీసులకు తెలిసే తమపై దాడి జరిగిందన్న అనుమానం కూడా వ్యక్తం చేశారు. దళితులపై దాడిచేసిన వారందరినీ తక్షణం అరెస్టు చేసి పంచాయతీ బోరు నుంచి నీరందేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

వైఎస్‌ఆర్‌సీపీ నేతల పరామర్శ

టీడీపీ గూండాల దాడిలో గాయపడి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అవిలాల మాజీ సర్పంచ్‌ వెంకటరమణను అమెరికా పర్యటనలో ఉన్న చంద్రగిరి నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించి ధైర్యం చెప్పారు. అలాగే చెవిరెడ్డి రఘునాథరెడ్డి, రాష్ట్ర పార్టీ నాయకులు ఉపేంద్రరెడ్డి, అవిలాల లోకనాథరెడ్డి, భానుకుమార్‌రెడ్డి, మొగరాల హరిప్రసాద్‌రెడ్డి, తిరుపతి రూరల్‌ మండల పార్టీ అధ్యక్షుడు మునీశ్వర్‌ రెడ్డి, దామినేటి కేశవులు, చిన్నియాదవ్‌, శశిదర్‌రెడ్డి, సాయిరాయల్‌, మల్లారపు శ్రీరాములు, మల్లారపు వాసు, తులసీరెడ్డి, పవన్‌ కుమార్‌రెడ్డి, చెంజి రాజేష్‌, యశ్వంత్‌రెడ్డి, వినోద్‌కుమార్‌తో పాటు పలువురు దళిత పంఘాల నేతలు పరామర్శించిన వారిలో ఉన్నారు.

దాడి అమానుషం

అవిలాల పంచాయతీ దళిత మాజీ సర్పంచ్‌ వెంకటరమణపై ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరుల దాడి దుర్మార్గం. చంద్రగిరి నియోజకవర్గంలో దళితులపై వరుసగా జరిగే దాడులు ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. తిరుపతి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు ఎదురుగానే మఠం భూములను కబ్జా చేసి కొట్టుకుంటుంటే పోలీసులు ఎందుకు స్పందించడం లేదో తెలియడం లేదు. ఎమ్మెల్యే పులివర్తి నాని భూ దాహానికి దళితులు రక్తం చిందించే పరిస్థితులు తలెత్తడం దారుణం. పోలీసు వ్యవస్థ దిగజారుడు తనానికి ఇదొక నిదర్శనం. పోలీసులు టీడీపీ గూండాలకు అండగా నిలబడడం వల్లనే పట్టపగలు ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. పంచాయతీ ప్రజలకు తాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన బోరును ఆక్రమణదారుల నుంచి కాపాడాలని నిరసన తెలిపితే తప్పా. దీనికే దాడి చేయాలా..? – చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి,

చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement