తిరుపతి సిటీ: ఎస్‌డీహెచ్‌ఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ చైర్మన్ డీవీఎస్ చక్రవర్తిరెడ్డి మాతృమూర్తి దేవపట్ల లక్ష్మీదేవమ్మ శనివారం తుది శ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తిరుపతిలోని డీవీఎస్ చక్రవర్తిరెడ్డి స్వగృహానికి చేరుకుని లక్ష్మీదేవమ్మ మృతదేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, మాజీ కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. లక్ష్మీదేవమ్మ అంత్యక్రియలు ఆదివారం వైఎస్సార్ కడప జిల్లా సుండుపల్లి మండలం, ముడుంపాడు గ్రామంలో జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు.
వీధి దీపాల నిర్వహణలో
అలసత్యం వద్దు
తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో వీధి దీపాల నిర్వహణలో అలసత్వాన్ని విడనాడాలని ఆ సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి శనివారం ఒక ప్రకటనలో సూచించారు. తొమ్మిది జిల్లాల్లోని కార్పొరేషన్లు, మునిసిపాలిటీల పరిధిలో వీధి దీపాల విద్యుత్ సర్వీసులు 13,568, పంచాయతీల పరిధిలో 41,918 సర్వీసులు ఉన్నాయని, వీటి నిర్వహణకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేసినప్పటికీ పలు ప్రాంతాల్లో నిర్వహణా లోపం కారణంగా పగటిపూట వీధి దీపాలు వెలుగుతూ విద్యుత్ వృథా అవుతోందని తెలిపారు.
రూ. కోటి ప్రమాద బీమా చెక్కు పంపిణీ
ఏపీఎస్సీడీసీఎల్ పరిధిలోని చిత్తూరు రూరల్ డివిజన్, రెడ్డిగుంట సబ్–డివిజన్ పరిధిలో విధుల నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు మరణించిన అసిస్టెంట్ లైన్ మ్యాన్ ఎన్.జ్ఞానశేఖర్ కుటుంబానికి కోటి పది లక్షల రూపాలయ ప్రమాద బీమా చెక్కును అందించారు. కార్పొరేట్ కార్యాలయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధుల తరఫున శనివా రం సీఎండీ శివశంకర్ చేతులు మీదుగా చెక్కును జ్ఞానశేఖర్ కుటుంబ సభ్యులకు అందజేశారు.
అలిపిరిలో రోడ్డు ప్రమాదం
– వృద్ధురాలి మృతి
తిరుపతి క్రైం : అలిపిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓరియన్ హోటల్ సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతి చెందింది. అలిపిరి సీఐ రామకిషోర్ తెలిపిన వివరాల ప్రకారం.. అయ్యప్ప కాలనీకి చెందిన లక్ష్మీకాంతమ్మ (70), భర్త మునిచంద్రారెడ్డి శనివారం రాత్రి సుమారు 7.05 గంటల సమయంలో ఓరియన్ హోటల్ వైపు నుంచి రోడ్డు దాటుతుండగా ప్రమాదానికి గురయ్యారు. తమిళనాడులోని సేలం జిల్లా రాసిపురానికి చెందిన భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుగుప్రయాణమయ్యారు. ఆ సమయంలో కారును విఘ్నేష్ నడుపుతున్నాడు. వేగంగా వచ్చిన కారు లక్ష్మీకాంతమ్మను ఢీకొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.


