కీలక విభాగాలన్నీ ఔట్‌సోర్సింగ్‌పైనే
2009 తర్వాత భారీ స్థాయిలో నియామకాలు చేపట్టని వైనం
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో శాశ్వత ఉద్యోగుల కొరత తీవ్రమవుతోంది. ఒకవైపు వరుసగా ఉద్యోగులు పదవీ విరమణ చేస్తుండగా, మరోవైపు కొత్త నియామకాలు చేపట్టకపోవడంతో కీలక విభాగాల్లో సిబ్బంది కొరత స్పష్టంగా కనిపిస్తోంది. అనేక శాఖల్లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులతోనే పనులు నెట్టుకొస్తున్న పరిస్థితి నెలకొంది. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో పరిపాలనాపరమైన ఇబ్బందులు మరింత పెరిగే అవకాశముందని ఉద్యోగ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
‘శాశ్వతంగా’తగ్గిపోతోంది!
టీటీడీ వ్యవస్థ 1933లో ఏర్పడగా, 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు అనంతరం స్వయం ప్రతిపత్తి కల్పించారు. అనంతరం పాలకమండలి ఆధ్వర్యంలో 64 శాఖల్లో అవసరానికి అనుగుణంగా ఉద్యోగులను నియమించారు. 1996 నాటికి టీటీడీలో శాశ్వత ఉద్యోగుల సంఖ్య 16 వేలకు చేరుకుంది. అనంతరం భక్తుల రద్దీ, టీటీడీ పరిధిలోని ఆలయాల సంఖ్య గణనీయంగా పెరిగినా, అవసరమైన స్థాయిలో నియామకాలు చేపట్టలేదు. 2009లో చివరిసారిగా నియామకాలు జరగగా, ఆ తర్వాత పెద్ద ఎత్తున భర్తీలు చేపట్టలేదు. ప్రస్తుతం శాశ్వత ఉద్యోగులు సుమారు 5 వేల మందికి పరిమితం కాగా, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు 14 వేల మందికి చేరినట్లు సమాచారం.
దేశ వ్యాప్తంగా విస్తరించిన టీటీడీ సేవలు
గతంలో తిరుమల–తిరుపతికే పరిమితమైన టీటీడీ కార్యకలాపాలు ప్రస్తుతం కన్యాకుమారి నుంచి జమ్మూ వరకు విస్తరించాయి. ఆలయాల సంఖ్య, భక్తుల సేవలు పెరుగుతున్నప్పటికీ, అందుకు అనుగుణంగా శాశ్వత సిబ్బందిని నియమించకపోవడం వల్ల పరిపాలనపై ప్రభావం పడుతోంది.
భద్రతా వ్యవస్థకు కీలకమైన విభాగం
2006లో వెలుగుచూసిన బంగారు డాలర్ల చోరీ ఘటన, అనంతరం శ్రీవారి ఆభరణాల భద్రతపై తలెత్తిన వివాదాల నేపథ్యంలో ప్రతి ఏడాది శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ పరిధిలోని 63 ఆలయాల్లో ఆభరణాల తనిఖీలు నిర్వహించడం ఆనవాయితీగా సాగుతోంది. ఉన్నతాధికారుల సమక్షంలో అప్రైజర్లు నిర్వహించే పరిశీలన నివేదికల ఆధారంగానే అధికారిక రికార్డులు సిద్ధమవుతాయి. ఏడాది పొడవునా రోటేషన్ పద్ధతిలో ఈ తనిఖీలు జరుగుతున్నప్పటికీ, అప్రైజర్ల పదవీ విరమణను ముందుగానే అంచనా వేసి కొత్త నియామకాలు చేపట్టడంలో యంత్రాంగం విఫలమైందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇన్వెంటరీ విభాగంలో అప్రైజర్ల కొరత
టీటీడీలో అత్యంత కీలకమైన ఇన్వెంటరీ విభాగంలో అప్రైజర్ల కొరత తీవ్రంగా మారింది. శ్రీవారి హుండీలో భక్తులు సమర్పించే బంగారం, వెండి, విలువైన కానుకలతో పాటు ఆలయ ఆభరణాల విలువ నిర్ధారణ, తనిఖీ బాధ్యతలను అప్రైజర్లు నిర్వహిస్తారు. టీటీడీ పరిధిలోని అన్ని ఆలయాల ఆభరణాల వార్షిక తనిఖీల్లో వీరి పాత్ర అత్యంత కీలకం. గతంలో 11 మంది అప్రైజర్లు విధులు నిర్వహించగా, ప్రస్తుతం ఒక్కరూ సేవలో లేకుండా పోయారు. దీంతో ఇటీవల పదవీ విరమణ చేసిన అప్రైజర్ సేవలను మరో ఏడాది పాటు పొడిగిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.
టీటీడీలో ఉద్యోగుల కొరత తీవ్రం
నియామకాలపై నిర్ణయం ఎప్పుడు?
రిటైర్మెంట్లతో శాశ్వత ఉద్యోగుల సంఖ్య క్రమంగా తగ్గిపోతుండగా, ఔట్‌సోర్సింగ్ సిబ్బందిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కీలక విభాగాల్లో అనుభవజ్ఞులైన శాశ్వత ఉద్యోగులను నియమించకపోతే భవిష్యత్‌లో పరిపాలన, భద్రత, సేవల నిర్వహణపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఉద్యోగులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం, టీటీడీ పాలకమండలి ప్రత్యేక దృష్టి సారించి ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టాలని ఉద్యోగ వర్గాలు కోరుతున్నాయి.


