తిరుమల: తిరుమల శ్రీవారిని శనివారం భారత్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, తమిళనాడు మంత్రి వినోద్ దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా.. టీటీడీ అధికారులు ఘనంగా లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు.
యూపీఎస్‌సీ పరీక్షకు
పటిష్ట ఏర్పాట్లు
తిరుపతి అర్బన్: యూపీఎస్‌సీకి చెందిన కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్స్ పరీక్షకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్టు డీఆర్వో నరసింహులు తెలిపారు. పరీక్ష ఏర్పాట్లపై ఆయన శనివారం కలెక్టరేట్‌లో ఉద్యోగులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలోని మూడు పరీక్షా కేంద్రాల్లో ఆదివారం 1,093 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నట్టు వెల్లడించారు. ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2 నుంచి సాయంత్ర 4 గంటల వరకు పరీక్ష ఉంటుందని చెప్పారు. బాలాజీ కాలనీలోని టీటీడీకి చెందిన శ్రీపద్మావతి బాలికోన్నత పాఠశాల వెస్ట్ చర్చ వద్ద, శ్రీపద్మావతి మహిళా జూనియర్ కళాశాల (వింగ్–ఏ)తోపాటు వింగ్–బీలో పరీక్ష ఉంటుందని స్పష్టం చేశారు. సమావేశంలో యూపీఎస్‌సీ అబ్జర్వర్ ఎన్.వసంత, స్టేట్ అబ్జర్వర్ బీ.ఆనంద్ పాల్గొన్నారు.
స్విమ్స్‌లో నిరంతర
వైద్యవిద్య కార్యక్రమం
తిరుపతి తుడా: స్విమ్స్ మెడిసిన్, పిడియాట్రిక్స్, టీబీ, ఆర్‌డీ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో పద్మావతి ఆడిటోరియం ఓపీడీ బ్లాక్‌లో నిరంతర వైద్య విద్య కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి సంక్లిష్ట వ్యాధులపై సమగ్ర అవగాహన, సకాలంలో నిర్ధారణ, ఆధునిక చికిత్స విధానాలు వైద్య విద్యార్థులకు అత్యంత అవసరమని తెలిపారు. శ్వాసక్రియ శరీరధర్మ శాస్త్రం నుంచి పిల్లలు, పెద్దల్లో వ్యాధి నిర్వహణ, జీవన నాణ్యత మెరుగుదల వరకు ప్రతి అంశంపై నిర్వహిస్తున్న అకడమిక్ కార్యక్రమాలు క్లినికల్ నైపుణ్యాలను పెంపొందించడంలో కీలక పాత్రి పోషిస్తాయని పేర్కొన్నారు. మెడిసిన్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్, ఫిజియాలజీ విభాగం డాక్టర్ పీవీ అరుంధతి పాల్గొన్నారు.
అక్షర పురుషోత్తమ
దర్శనం ప్రారంభం
తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీలో అక్షర పురుషోత్తమ దర్శనాన్ని శనివారం బాప్స్ శ్రీ స్వామి నారాయణ సంప్రదాయ అధ్యక్షుడు శ్రీ సాధు భద్రేశ దాసస్వామి ఘనంగా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో అక్షర పురుషోత్తమనే నూతన దర్శనాన్ని ప్రారంభించడం హర్షణీయమన్నారు. విశ్వవిద్యాలయం వివిధ దర్శనాలకు నిలయమని, అన్ని దర్శనాల సమావేశం అక్షర పురుషోత్తమ దర్శనంలో చూడవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీసీ జీఎస్‌ఆర్ కృష్ణమూర్తి, అకడమిక్ డీన్ రజనీకాంత్ శుక్లా, దర్శన విభాగ డీన్ గణపతిభట్, పలు విభాగాల అధ్యాపకులు, రీసెర్చ్ స్కాలర్స్ పాల్గొన్నారు.


