ఫలితం లేదు! | - | Sakshi
Sakshi News home page

ఫలితం లేదు!

Aug 2 2026 1:58 AM | Updated on Aug 2 2026 1:58 AM

● ఎస్వీయూలో పరీక్షలు నిర్వహించి నెలలు గడుస్తున్నా విడుదల కాని ఫలితాలు ● పీజీ, యూజీ ఫలితాల జాప్యంతో విద్యార్థులకు తప్పని తిప్పలు ● అధికారులకు విన్నవించుకున్నా ఫలితం శూన్యం

తిరుపతి సిటీ: ఎస్వీయూలో విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రధానంగా పరీక్షల విభాగం మొద్దు నిద్రను వీడనంటోంది. ఇది అవినీతికి అడ్డాగా మారింది. ఈ క్రమంలో విద్యార్థుల పరిస్థితి అయోమయంలో పడింది. అవినీతికి కేంద్రంగా మారిన ఎగ్జామినేషన్‌ సెక్షన్‌ను ప్రక్షాళన చేశామని చెబుతున్న అధికారులకు ఇటీవల పరీక్షా విభాగంలో జరిగిన చలానాల కుంభకోణం సవాల్‌ విసిరింది. విద్యార్థులకు సకాలంలో ధ్రువపత్రాలు అందించడంలో, పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదల్లోనూ నిర్లక్ష్యం నెలకొంటోంది. దీనిపై పలు మార్లు విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసలు చేసినా ఫలితం లేకుండా పోతోంది.

దిక్కుతోచని స్థితిలో విద్యార్థులు

ఎస్వీయూ పరిధిలో గత రెండేళ్లుగా పరీక్షల ఫలితాల విడుదలలో తీవ్ర జాప్యం నెలకొంటోంది. కోర్సులు పూర్తి చేసిన విద్యార్థుల పరిస్థితి అయోమయంలో పడిపోతోంది. యూజీ, పీజీ పరీక్షల ఫలితాలు సక్రమంగా విడుదల కాకపోవడంతో పోటీ పరీక్షలకు, ఉన్నత విద్యకు దరఖాస్తులు చేసుకునే విద్యార్థులకు దిక్కుతోచని స్థితి నెలకొటోంది. పరీక్షలు జరిగి ఆరు నెలలు పైబడినా ఫలితాలు విడుదల కాకపోవడం ఏమిటని అధికారులను ప్రశ్నించినా త్వరలో విడుదల చేస్తామని నిర్లక్ష్య సమాధానం వస్తోందని విద్యార్థి సంఘాలు పేర్కొంటున్నాయి.

పరీక్షల నిర్వహణలోనూ అలసత్వమే

పరీక్షల నిర్వహణలోనూ ఎస్వీయూ ఎగ్జామినేషన్‌ సెక్షన్‌ అలసత్వం ప్రదర్శిస్తోంది. వర్సిటీ పరిధిలో గత విద్యా సంవత్సరంలో జరగాల్సిన పీజీ సెకండ్‌ సెమిస్టర్‌ పరీక్ష ఇప్పటివరకు నిర్వహించలేదు. అలాగే యూజీ కోర్సులకు సంబంధించి పరీక్షల నిర్వహణలో రాష్ట్రంలోని 17 ప్రభుత్వ యూనివర్సిటీలలో ఇంత దారుణమైన పరిస్థితి ఎక్కడా లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కనీసం డిగ్రీ పరీక్షలు సైతం సక్రమంగా నిర్వహించిన దాఖలాలు లేవని, పరీక్షల నిర్వహించడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆవేదన చెందుతున్నారు. యూజీ, పీజీ కోర్సుల పరీక్షలకు సంబంధించి హాల్‌టికెట్ల జారీలోనూ సాంకేతిక లోపం చూపిస్తూ ప్రతిసారీ జాప్యం చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఫలితాలు విడుదల కావల్సిన కోర్సుల వివరాలు

కోర్సులు సెమిస్టర్‌ పరీక్షలు జరిగిన తేదీ

ఎల్‌ఎల్‌బీ 1వ, 3వ, 5వ, 7వ, 9వ ఏఫ్రిల్‌ నెలలో

ఎల్‌ఎల్‌ఎమ్‌ 2వసెమ్‌, 3వ సెమిస్టర్‌ ఫిబ్రవరి 17, ఏప్రిల్‌ 16

పీజీ అన్ని కోర్సులు 1వ, 3వ, 4వ సెమిస్టర్‌ ఫిబ్రవరి, ఏప్రిల్‌ నెలలో

ఎంబీఏ 1వ, 4వ సెమిస్టర్‌ జనవరి 23, ఏప్రిల్‌ నెలలో

బీఈడీ 4వ సెమిస్టర్‌ ఏప్రిల్‌లో

యూజీ 2వ, 3వ, 4వసెమిస్టర్‌ డిసెంబర్‌–జనవరి నెలలో

యూజీ, పీజీ రీవాల్యుయేషన్‌ సుమారు 7 నుంచి 8 నెలలు

యూజీ సప్లమెంటరీ పరీక్షలు సుమారు 6 నెలలు

త్వరలో ఫలితాలు విడుదల చేస్తాం

ఎస్వీయూలో పలు యూజీ, పీజీ కోర్సులకు సంబంధించి ఫలితాలు త్వరలో విడుదల చేస్తాం. ఆన్‌లైన్‌ ప్రక్రియతో కాస్త ఆలస్యమైంది. పరీక్షా విభాగాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేశాం. వేసవి సెలవుల కారణంగా మూల్యాంకన ప్రక్రియ ఆలస్యమైంది తప్ప ఇందులో ఎటువంటి నిర్లక్ష్యం లేదు.

– కే సురేంద్రబాబు,

ఎగ్జామినేషన్‌ డీన్‌, ఎస్వీయూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement