21న జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌17 ప్రయోగం | - | Sakshi
Sakshi News home page

21న జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌17 ప్రయోగం

May 12 2026 5:48 AM | Updated on May 12 2026 5:48 AM

● వాయిదా పడితే జూన్‌ 10న ● నింగిలోకి ఈఓఎస్‌–05 ఉపగ్రహం

సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌)లోని రెండో ప్రయోగవేదిక నుంచి ఈనెల 21న సాయంత్రం 3.15 గంటలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌17 ప్రయోగాన్ని నిర్వహించేందుకు సిద్ధం చేస్తున్నారు. అనివార్య కారణాలతో ప్రయోగం వాయిదా పడితే జూన్‌ 10వ తేదీన చేసే అవకాశం ఉంది. ఈ ప్రయోగం ద్వారా 1,117 కిలోలు బరువు కలిగిన ఈఓఎస్‌–05 (జీఐశాట్‌–1ఏ) అనే భూ పరిశీలన ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు. వరుసగా రెండు పీఎస్‌ఎల్‌వీ పరాజయాల తరువాత చేయబోయే ప్రయోగం అయినందున ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ ఏడాది సగం గడిచిపోయినప్పటికీ జనవరి నెలలో చేసిన పీఎస్‌ఎల్‌వీ సీ62 పరాజయం ఇస్రో శాస్త్రవేత్తలను కొంత ఆత్మరక్షణలో పడేసింది. అందుకే జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–17 ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించేందుకు అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌17 రాకెట్‌ శిఖరభాగాన అంటే క్రయోజనిక్‌ దశపై ఉపగ్రహాన్ని అమర్చే విషయంలో కొంత సాంకేతికలోపం తలెత్తడంతో ప్రయోగం వాయిదా పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సాంకేతిక లోపాలన్నింటిని సవరించుకుని ఈనెల 21న లేదా జూన్‌ 10న ప్రయోగాన్ని నిర్వహించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.

ఉపగ్రహంతో ఉపయోగాలు

జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌17 రాకెట్‌ ద్వారా రోదశీలోకి పంపబోయే ఈఓఎస్‌–05 (జీఐశాట్‌–1ఏ) ఉపగ్రహం పూర్తిగా భూ పరిశీలన ఉపగ్రహం కావడం విశేషం. అయితే భూ పరిశీలనలో ఈఓఎస్‌–05 ఉపగ్రహం సెకెండ్‌ జనరేషన్‌ శాటిలైట్‌ కావడం విశేషం. ఈ ఉపగ్రహంలో మల్టీ స్పెక్ట్రల్‌, హైపర్‌ స్పెక్ట్రల్‌ బ్యాండ్స్‌ అనే రెండు రకాల బ్యాండ్స్‌ను అమర్చి పంపుతున్నారు. ఈ బ్యాండ్‌లలోలున్న ఉపకరణాలను ఉపయోగించి ఆకాశంలో మేఘాలు లేని పరిస్థితుల్లో, దేశంలోని విశాలమైన ప్రాంతాలను నిజమైన సమయ ఛాయాచిత్రాలను తరచుగా అందిస్తుంది. ప్రతి ఐదు నిమిషాలకు ఎంచుకున్న క్షేత్ర చిత్రాన్ని ప్రతి 30 నిమిషాలకు 42 మీటర్ల స్పేషియల్‌ రిజల్యూషన్‌తో భారత భూభాగాన్ని మొత్తంగా ఛాయాచిత్రాలను అందిస్తుంది. ఇది దేశంలోని వ్యవసాయం, భూమి, సముద్రాల మీద అధ్యయనం చేయడంతో పాటు దేశ రక్షణకు కూడా ఉపయోగపడనుంది.

Advertisement
 
Advertisement
Advertisement