తిరుపతి కల్చరల్: కస్టమర్లను నట్టే ముంచిన అగ్రిగోల్డ్ యజమానుల బినామీ ఆస్తులు జప్తు చేసి, బాధితులకు వడ్డీతో సహా చెల్లించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ముప్పాళ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. గంధమనేని శివయ్యభవన్‌లో శనివారం ఉమ్మడి చిత్తూరు జిల్లా అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ వెల్పేర్ అసోసియేషన్ ప్రాంతీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, ప్రసంగించారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారం కోసం విజయవాడ కేంద్రంగా త్వరలో ప్రత్యేకకోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుటుందని తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టో మేరకు ప్రభుత్వం సమస్యను సత్వరం పరిష్కరించాలని కోరారు. అసోసియేషన్ ఉమ్మడి చిత్తూరు జిల్లా గౌరవాధ్యక్షుడు టి.జనార్దన్ మాట్లాడుతూ అగ్రిగోల్డ్ ఆస్తుల విలువల నేడు రూ.30 వేల కోట్లకుపైగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మురళి, అసోసియేషన జిల్లా అధ్యక్షుడు బి.శ్రీనివాస్, ఉమాశంకర్, జయచంద్ర, జయరామయ్య, ఉమాదేవి, ఉమారాణి, సుశీల, రెడ్డెప్పరెడ్డి పాల్గొన్నారు.


