ఏర్పేడు: మండలంలోని చిందేపల్లిలో తెలుగు తమ్ముళ్లు కాసులవేటలో ఉన్నారు. బరితెగించి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మట్టి, ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా రవాణా చేస్తూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. వారి అక్రమాలను అరికట్టడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఏర్పేడు మండలం చిందేపల్లిలో గత ప్రభుత్వ హయాంలో తిరుపతి నగరవాసులకు ఇళ్ల స్థలాలను కేటాయించి, ఇళ్లను నిర్మించారు. అయితే శనివారం చిందేపల్లికి చెందిన ఓ టీడీపీ నాయకుడు ఏకంగా జగనన్న కాలనీలో జేసీబీ పెట్టి ట్రాక్టర్లతో గుంతలు తవ్వి ట్రాక్టర్ల ద్వారా మట్టి తరలించారు. ఈ తంతు పట్టపగలే జరుగుతున్నా అటువైపు కన్నెత్తి చూసిన అధికారి లేరు. జగనన్న కాలనీలో వీధులకు మట్టి తోలుకోమని హౌసింగ్ అధికారులు తమకు అనుమతులిచ్చారని చెప్పుకుంటూ యథేచ్ఛగా మట్టిని ట్రాక్టర్ల ద్వారా తవ్వి తరలిస్తున్నారు. 10 అడుగుల లోతుకు పైగా మట్టిని తవ్వేయడంతో సమీపంలో నిర్మించిన ఇళ్లు దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంది. అయితే మట్టి అక్రమ రవాణాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే మండలంలోని నచ్చనేరి అటవీ ప్రాంతం నుంచి కొన్ని రోజులుగా రేయింబవళ్లు మట్టిని ప్రైవేటు వెంచర్లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నా అధికారగణం మిన్నకుండటం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


