తిరుపతి సిటీ: స్థానిక ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో తమిళనాడులోని చైన్నెకి చెందిన వీల్స్ ఇండియా కంపెనీ ప్రతినిధులు శనివారం పాలిటెక్నిక్ విద్యార్థులకు క్యాంపస్ డ్రైవ్ నిర్వహించారు. ఇంటర్వ్యూలకు ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలలోని పలు పాలిటెక్నిక్‌ల నుంచి ట్రిపుల్‌ఈ, ఈసీఈ, మెకానికల్, ఆటోమొబైల్స్ విభాగల నుంచి రాత పరీక్షలో అర్హత సాధించిన 58 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కంపెనీ హెచ్‌ఆర్, టెక్నికల్ బృందాలు రెండు రౌండ్లలో వ్యక్తిగత ఇంటర్వ్యూలను నిర్వహించి 20మంది అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ వై ధ్వారకనాథ్‌రెడ్డి మాట్లాడుతూ విద్యాభ్యాసానికి, పారిశ్రామిక అవసరాలకు మధ్య వారధిగా నిలుస్తూ, విద్యార్థులకు నాణ్యమైన ప్లేస్‌మెంట్ అవకాశాలను అందించడంలో ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ముందుంటుందని తెలపారు. ఈ కార్యక్రమంలో ప్లేస్‌మెంట్ ఆఫీసర్ రాధ, ఆర్ జయచంద్ర, బాలాజీ, కంపెనీ ప్రతినిధులు మణికందన్, విజయ్, ఆకాష్ పాల్గొన్నారు
గుర్తు తెలియని వ్యక్తి మృతి
తిరుపతి క్రైం : నగరంలోని రవీంద్ర నగర్‌లో శనివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం మేరకు.. రవీంద్ర నగర్‌లోని విద్యుత్ సబ్‌స్టేషన్ పక్కన శనివారం ఉదయం సుమారు 35 ఏళ్ల వయస్సు గల గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం ఉండగా స్థానికులు గుర్తించారు. ఈ విషయమై పోలీసులకు సమాచారం అందజేశారు. వారు వచ్చి సంఘటన స్థలంలో మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి ఎడమ చేతిపై ‘సుబ్బు‘ అనే పచ్చబొట్టు ఉన్నట్లు గుర్తించారు. అలాగే అతను నలుపు రంగు టీషర్ట్, తెలుపు రంగు 3/4 ప్యాంట్ ధరించి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే లేదా అతనికి సంబంధించిన బంధువులెవరైనా ఉంటే వెంటనే అలిపిరి పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ నరసింహరావును సంప్రదించాలని పోలీసులు కోరారు. సమాచారం కోసం 9440796752, 9154141869 నంబర్లకు ఫోన్ చేయవచ్చని సూచించారు.
తెలుగుగంగ కాలువలో యువకుడి గల్లంతు
వెంకటగిరి రూరల్: పట్టణంలోని బంగారుపేట సమీపంలో ఉన్న తెలుగంగ కాలువలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం మేరకు.. బంగారుపేటకు చెందిన చెంజి రమేష్ (39) వెంకటగిరి పట్టణంలో ఓ దుకాణంలో పనిచేస్తున్నాడు. శనివారం ఉదయం బహిర్భూమి కోసం తెలుగంగ వంతెన వద్దకు వెళ్లి కాలువలో కాళ్లు కడుగుతుండగా ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకొపోయి గల్లంతయ్యారు. ఈ మేరకు రాపూరు అగ్నిమాపక అధికారి కుప్పయ్య నేతృత్వంలో అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు కలసి తెలుగంగ కాలువలో రమేష్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఆచూకీ లభించలేదు. రమేష్‌కు భార్య, తండ్రి ఉన్నారు.


