ఇక పల్లె పాలన ‘ప్రత్యేక’ం | - | Sakshi
Sakshi News home page

ఇక పల్లె పాలన ‘ప్రత్యేక’ం

Mar 22 2026 2:07 AM | Updated on Mar 22 2026 2:07 AM

ప్రత్యేక అధికారుల చేతుల్లోకి గ్రామ పంచాయతీ పగ్గాలు

ఏప్రిల్‌ 2తో ముగియనున్న సర్పంచ్‌ల పదవీకాలం

స్పెషల్‌ ఆఫీసర్ల జాబితాను సిద్ధం చేస్తున్న అధికారులు

స్థానిక సంస్థల పాలకవర్గాల గడువు పది రోజుల్లో ముగియనున్నది. అయితే బాబు సర్కారు స్థానిక స్థంస్థల ఎన్నికలు నిర్వహించలేని దుస్థితి నెలకొంది. బాబు ప్రభుత్వం బీసీ రిజర్వేషన్‌ కల్పిస్తామని హామీ ఇచ్చి.. దాన్ని అమలు చేయలేక నిస్సహాయంగా మిగిలింది. దీనికితోడు పలు న్యాయపరమైన సమస్యలున్నాయి. ఈ క్రమంలో పల్లె పాలన ప్రత్యేకాధికారుల చేతుల్లోకి వెళ్లనుంది.

తిరుపతి అర్బన్‌: పల్లె పగ్గాలు ప్రత్యేక అధికారుల చేతుల్లోకి వెళ్లనున్నాయి. ఏప్రిల్‌ 2తో సర్పంచ్‌ల పదవీకాలం ముగుస్తోంది. సాధారణంగా గడువు లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే బీసీ రిజర్వేషన్‌తోపాటు పలు సాంకేతిక న్యాయపరమైన అంశాలను పరిష్కారంచాల్సి ఉన్న నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ జాప్యం అయ్యేలా ఉంది. దీంతో ఏప్రిల్‌ 2 తర్వాత పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించడానికి జిల్లాధికారులు జోరుగా కసరత్తు చేస్తున్నారు. దీంతో సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న పలువురు ఆశావహులు అలోచనలో పడ్డారు. జిల్లాలో 811 గ్రామ పంచాయతీలున్నాయి. ఈ పంచాయతీలకు ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, వ్యవసాయ, ఉద్యానశాఖ, పంచాయతీరాజ్‌ ఇంజినీర్లు, ఇరిగేషన్‌ అధికారులు, మండల విద్యాశాఖాధికారులు, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు, ఆరోగ్యశాఖ అధికారులు తదితర విభాగాలకు చెందిన మండల స్థాయి అధికారులను గ్రామ పంచాయతీలకు ప్రత్యేకాధికారులుగా నియమించనున్నారు. అధికారుల కొరత కారణంగా పలు మండలాల్లో రెండు లేదా మూడు పంచాయతీల బాధ్యతలు ఒకే అధికారికి అప్పగించనున్నారు. ఎన్నికల జాప్యానికి ప్రధానంగా బీసీ రిజర్వేషన్‌ అంశం కొలిక్కిరావాల్సి ఉంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని కూటమి సర్కార్‌ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాల్సి ఉంది. ఈ చిక్కుముడులు వీడిన తర్వాతే ఎన్నికలు ఉంటాయని చర్చసాగుతోంది. జూన్‌ తర్వాత ఎన్నికలుంటాయని రాజకీయ నేతలు అంచన వేస్తున్నారు. మరోవైపు ఎన్నికలు నిర్వహిస్తే కార్యకర్తలకు వందశాతం సంతృప్తి పరచలేమని, ఏడాదిపాటు ఎన్నికలు వాయిదా వేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఎప్పుడుంటుందనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

జిల్లా సమాచారం...

జిల్లా జనాభా : 25.50 లక్షలు

మండలాలు: 36

రెవెన్యూ డివిజన్లు: 3

మున్సిపాలిటీలు: 5

కార్పొరేషన్‌: 1

పంచాయతీలు: 811

కొత్త పంచాయతీలకు ప్రతిపాదనలు:

25 నుంచి 30 వరకు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement