పక్కా ఇళ్లు..
ఆన్‌లైన్..జియో ట్యాగ్ సర్వేకు
6,048 ఇళ్ల తేడా
అనుమానాలు రావడంతో తిరుపతిలో విజిలెన్స్ కమిటీ విచారణ
జిల్లాలో 12 మండలాల్లో హౌసింగ్
అధికారులకు షోకాజ్ నోటీసులు
తిరుపతి జిల్లాలో గందరగోళంగా మారిన హౌసింగ్ శాఖ
తిరుపతి అర్బన్: చంద్రబాబు సర్కార్ హౌసింగ్ భాగోతం అంతా ఇంతా కాదు. ప్రధానంగా జగనన్న కాలనీల్లో(ఎన్టీఆర్ నగర్)ఇళ్ల నిర్మాణం చేపట్టకుండానే బిల్లులు మంజూరు చేయడం దుమారంగా మారింది. అప్పటి ప్రభుత్వంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 571 లే అవుట్లు వేసి, పేదలకు 61,799 ఇళ్ల పట్టాలు ఇవ్వడంతోపాటు ఇళ్లు మంజూరు చేయించారు. రెండేళ్లలో 50 శాతం ఇళ్లు పూర్తి చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఇసుక కొరత ఓ వైపు, చేసిన పనులకు బిల్లు లు సకాలంలో ఇవ్వకపోవడం మరోవైపు, అప్పటి ఇంటి నిర్మాణ కాంట్రాక్టర్లు వైఎస్సార్‌సీపీకి అనుకూ లం అంటూ కాంట్రాక్టర్లను మార్పు చేయడం మరోవైపు పెట్టుకుంది. ఈ మార్పులకే ఎనిమిది నెలలు కాలం గడిచింది. దీంతో ఇంటి నిర్మాణాలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. ఆ తర్వాత ఏడాది నుంచి ఇంటి నిర్మాణాలు వేగవంతం చేయాలంటూ ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో హౌసింగ్ అధికారులు మార్పులు చేసిన ఇంటి నిర్మాణ కాంట్రాక్టర్ల స్థానంలో తమ సతీమణి, అన్నదమ్ముళ్లు, బంధువులకే కాంట్రాక్టర్ల బాధ్యతలు అప్పగించి పెత్తనం మొత్తం హౌసింగ్ ఉద్యోగులు చేపట్టడం మొదలుపెట్టారు. అంతటితో ఆగకుండా నిర్మాణాల్లో ప్రతి వారం, ప్రతి నెలా పురోగమం చూపాలంటూ రాష్ట్రస్థాయి నుంచి ఒత్తిళ్లు రావడంతో చిత్ర విచిత్రంగా వ్యవహరించారు. సాధారణంగా ఐదు దశల్లో బేస్‌మెంట్, కిటికీ లెవల్ గోడలు, స్లాబ్ లెవల్ గోడలు, స్లాబ్, పూతలు ఇలా ఇంటి నిర్మాణానికి దశల వారీగా రూ.1.80 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంది.
నాణ్యతకు ప్రాధాన్యం
ఇళ్ల నిర్మాణంలో నాణ్యతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. ప్రధానంగా ఇంటి నిర్మాణానికి సిమెంట్ 90 బస్తాలు వాడావాల్సి ఉంది, అందుకు రూ. 24,930 ఖర్చు చేయాలి. అలాగే స్టీల్ 480 కిలోలు వాడాలి. అందుకు రూ. 33,600 ఖర్చు చేయాల్సి ఉంది. మిగిలిన మొత్తాన్ని ఇసుక, సిమెండ్ రాళ్లు లేదా ఇటుకలకు, కూలీలకు ఖర్చు చేయాల్సి ఉంది.
నిబంధనలకు విరుద్ధంగా పనులు
చంద్రబాబు సర్కార్‌లో నిబంధనలకు విరుద్ధంగా, సంపాదనే ధ్యేయంగా ఇంటి నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను గాలికి వదిలేసినట్లు పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా బేసిమెంట్ లెవల్‌కు మట్టిని నింపకపోవడం, సిమెంట్ 90 బస్తాలు వాడకుండా అందులో 70 శాతం సిమెంట్‌ను మాత్రమే వాడుకుని అధిక మొత్తంలో ఇసుకను ఉపయోగించడం, స్టీల్ విషయంలోను 480 కిలోల్లో 50 శాతం మాత్రమే వాడినట్లు తెలుస్తుంది. ఇలా నామమాత్రంగా పనిచేయడంతో నాణ్యత పూర్తిగా లోపించినట్లు విమర్శలు ఉన్నాయి.
రెండు నెలల కిందట పీడీ సస్పెన్షన్
జిల్లా హౌసింగ్ పీడీ దయాకర్‌ను రెండు నెలల కిందట సిమెంట్, స్టీల్ స్టాక్‌కు సంబంధించి సక్రమంగా లెక్కలు లేకపోవడంతో సస్పెండ్ చేశారు. అనంతరం గూడూరు ఈఈగా ఉన్న శ్రీనివాసరావుకు పీడీ బాధ్యతలు అప్పగించారు. అంతేకాకుండా గూడూరు ఈఈగా, శ్రీకాళహస్తి ఈఈగా, సూళ్లూరుపేట ఈఈగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఒక్క ఉద్యోగికి నాలుగు పోస్టులు కట్టబెట్టారు. అయినా ఆయన కలెక్టరేట్‌లోని హౌసింగ్ జిల్లా కార్యాలయానికే పరిమితం అవుతున్నారనే విమర్శలు లేకపోలేదు.
పీడీ పోస్టు, మూడు ఈఈ పోస్టులు శ్రీనివాసరావుకే
గృహనిర్మాణ విభాగానికి సంబంధించి జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్(పీడీ)గా, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, గూడూరు ఈఈగా శ్రీనివాసరావు పనిచేస్తున్నారు. మొత్తంగా ఆయనకు నాలుగు పోస్టులు కట్టబెట్టారు. గృహనిర్మాణానికి సంబంధించి జిల్లాలో నాలుగు డివిజన్లకు నలుగురు ఈఈలు పనిచేయాల్సి ఉంది. ఆ డివిజన్లలో ఈఈ పాత్రే కీలకం. వేగంగా పనులు పూర్తి చేయడం ఈఈ డైరెక్షన్‌లోనే ఉంటుంది. అయితే నాలుగు డివిజన్లలో మూడు డివిజన్లకు ఒక్కరే ఈఈ. అంతేకాకుండా జిల్లా అధికారిగా పీడీ పోస్టును ఆయనకే కట్టబెట్టడంపై పలువురు మండిపడుతున్నారు. తాజాగా ఈ నెల 31న(శనివారం) తిరుపతి డివిజన్ ఈఈగా పనిచేస్తున్న మోహన్‌రావు ఉద్యోగ విరమణ పొందారు. దీంతో ఆ బాధ్యతలు స్వీకరించడానికి డీఈలు ముందుకు రావడం లేదని చర్చసాగుతోంది. దీంతో ఆ పోస్టును శ్రీనివాసరావు తీసుకుంటే ఇక అంతేసంగతులు అంటూ చర్చసాగుతుంది.
అడుసు పాళెం జగనన్న లే అవుట్
ఇంటి నిర్మాణ బిల్లులో మోసాలిలా..
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల నిర్మాణానికి ఐదు దశల్లో రూ.1.80 వేలు బిల్లు చెల్లించాల్సి ఉంది. మొదటి దశలో బేసిమెంట్ వేయడంతోపాటు లోపల బేసిమెంట్ లెవల్‌కు మట్టితో నింపడానికి రూ.70 వేలు, రెండో దశలో కిటికీల వరకు గోడలు నిర్మాణానికి రూ.20 వేలు, మూడో దశలో స్లాబ్ వరకు గోడల నిర్మాణానికి రూ.30 వేలు, నాలుగో దశ స్లాబ్ వేయడానికి రూ. 40 వేలు, చివరిగా పూతలు వేయడానికి రూ, 20 చొప్పున మొత్తంగా 1.80 లక్షలు ఒక్కో ఇంటికి జమ చేయాలి ఉంది.
ఇల్లు కట్టకుండానే బిల్లులు
నిర్మాణ దశలు తారుమారు
పురోగమనం చూపాల్సి రావడంతో మొదటి దశలో ఉండే పనులు రెండో దశగా, రెండో దశ పనులు మూడో దశగా, మూడో దశను నాలుగో దశగా, నాలుగో దశ పనులను ఐదో దశగా, ఐదో దశ పనులు పూర్తి అయినట్లు చూపించారు. అయితే దశల వారీగా ఫొటోలను అన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సిఉంది. ఈ క్రమంలో మొదటి దశ ఇంటికి సమీపంలో రెండో దశలో ఉన్న ఇంటి ఫొటోను, రెండో దశ ఇంటికి మూడో దశలో ఉన్న ఇంటి ఫొటో, మూడో దశ ఇంటికి నాలుగో దశ ఫొటోను, నాలుగో దశ ఇంటికి ఐదో దశ ఫొటోను అప్‌లోడ్ చేశారు. ఈ మేరకు ఇంటి బిల్లులు మంజూరు చేయించారు. అయితే ఆ తర్వాత ఇంజినీరింగ్ అసిస్టెంట్ల ద్వారా వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణాలకు జియోట్యాగింగ్ సర్వే నిర్వహించారు. ఏ దశలో ఉన్న ఇంటిని ఆ దశలో జియో ట్యాగింగ్ చేస్తేనే తీసుకోవడం జరిగింది. ఈ సర్వే సందర్భంగా దశల్లో తేడాలు స్పష్టంగా వెలుగులోకి వచ్చా యి. 6,157 ఇళ్లు తేడాలు వచ్చినట్లు రాష్ట్ర స్థాయి అధికారులు గుర్తించి, జిల్లా అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. రెండు నెలల్లో తేడాలను సవరించాలని స్పష్టం చేశారు. అయితే వారం రోజు ల్లోనే జిల్లా అధికారులు 5,240 ఇళ్లను సవరించామని అన్‌లైన్‌లో కొట్టేశారు. మిగిలిన 910 ఇళ్లు పరిశీలన చేయాల్సి ఉందని రిపోర్ట్ పంపించారు. దీంతో మరోసారి అనుమానంతో హౌసింగ్ విజిలెన్స్ కమిటీ వచ్చింది. విజిలెన్స్ వారం రోజులు పరిశీలన తర్వాత గందరగోళంగా దశలను చూపించిన వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చింది.
పక్కా ఇళ్లు..
పక్కా ఇళ్లు..


