గ్రామాల అభివృద్ధికి పన్నుల వసూలే కీలకం
తిరుపతి సిటీ: గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ఆర్థిక వనరులు అత్యంత అవసరమని, అందులో భాగంగా పన్నుల వసూలు లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ వేంకటేశ్వర్ ఆదేశించారు. మంగళవారం స్థానిక ఎస్వీయూ శ్రీనివాస ఆడిటోరియంలో పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూలు, శానిటేషన్ నిర్వహణ, పీ3 విధానం అమలుపై జిల్లా స్థాయి అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పన్నుల వసూలులో అలసత్వం వహిస్తే గ్రామాభివృద్ధి నిలిచిపోతుందని, పన్నుల వసూలుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. బకాయి పన్నులపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి, ప్రజలకు అవగాహన కల్పిస్తూ వసూలు చేయాలన్నారు. శానిటేషన్ – స్వచ్ఛతకు ప్రాధాన్యం ఇస్తూ ప్రతి గ్రామాన్ని శుభ్రంగా ఉంచడం పంచాయతీ రాజ్ శాఖ ప్రధాన బాధ్యత అని తెలిపారు. ఇంటింట చెత్త సేకరణ, తడి–పొడి చెత్త, ఘన వ్యర్థాల నిర్వహణలో ఎలాంటి లోపాలు ఉండకూడదని ఆదేశించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమాలను కూడా ప్రతి నెలా మూడో శనివారం నిర్వహిస్తున్నామన్నారు. పీ3 విధానం అమలులో ప్రజల భాగస్వామ్యం ఉండేలా చూడాలని ఆదేశించారు. అనంతరం జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పంచాయతీ రాజ్ సిబ్బందికి కలెక్టర్, పంచాయతీరాజ్ శాఖ అడిషనల్ కమిషనర్ చేతుల మీదుగా అవార్డుల ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ అడిషనల్ కమిషనర్ సుధాకర్‌రావు, డీపీఓ సుశీలాదేవి, డీడీఓలు, జిల్లా పంచాయతీ శాఖాధికారులు, సెక్రటరీలు, సిబ్బంది పాల్గొన్నారు.


