
నైలెట్‌తో ఉపాధి
తిరుపతి సిటీ : నేషనల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ( నైలెట్)తో స్థానిక యువతకు ఉన్నత స్థాయి ఉపాధి, ఉద్యోగాలు లభించే సువర్ణావకాశం ఉందని ఎంపీ గురుమూర్తి తెలిపారు. ఎస్వీయూ ప్రాంగణంలో తాత్కాలిక భవనంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్ శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్ వర్చువల్ విధానంలో ఈ కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించగా ఎంపీ గురుమూర్తి, అధికారులతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ .. నైలెట్ శిక్షణ కేంద్ర ఎస్వీయూలో ప్రారంభించడంతో ఇందులో శిక్షణ పొందిన యువతకు ఆధునిక ఐటీ టెక్నాలజీతో పాటు ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రత్యేక శిక్షణ పొందనున్నట్లు తెలిపారు.కార్యక్రమంలో ఎస్వీయూ వీసీ అప్పారావు, నైలట్ సెంటర్ ప్రతినిధులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
నైలెట్ సాధనలో ఎంపీ పాత్ర కీలకం
కేంద్ర శిక్షణ సంస్థ నైలెట్ సాధనలో తిరుపతి ఎంపీ పాత్ర కీలకమని అధికారులు, అధ్యాపకులు పేర్కొన్నారు. ఏడాదికి కనీసం 1000 మంది యువతకు పూర్తి స్థాయి అధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి ఉన్నత ఉద్యోగాలు సాధించే అవకాశం ఉంటుందన్నారు.
ఐటీ శిక్షణతో పాటు షార్ట్ టర్మ్ కోర్సులు
నైలెట్ ఆవిర్భావం తిరుపతిలో సాంకేతిక శిక్షణకు సరికొత్త అడుగుపడింది. నైలెట్‌లో ఐటీ సంబంధిత శిక్షణతో పాటు వెబ్ డిజైనింగ్, పీసీ హార్డ్‌వేర్ నెట్‌వర్కింగ్, ఆఫీస్ ఆటోమేషన్, అకౌంటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి షార్ట్‌టర్మ్ కోర్సులు అందించనున్నారు. అదనంగా, ఎంబీడెడ్ సిస్టమ్ డిజైన్, సైబర్ సెక్యూరిటీ, సైబర్ ఫోరెన్సిక్స్, సెమికండక్టర్ డిజైన్, డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక సాంకేతిక రంగాల్లోనూ యువతకు శిక్షణ లభించనుంది.