
తిరుచానూరులో అత్యాధునిక హోటల్
చంద్రగిరి : తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు అత్యుత్తమ సేవలను అందించేందుకు తిరుచానూరులో అత్యాధునిక హంగులతో హోటల్ ఏర్పాటైంది. తిరుచానూరు సమీపంలోని జాతీయ రహదారికి ఆనుకుని లెమన్ ట్రీ హోటల్స్ ప్రీమియర్‌ను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానంద రెడ్డి, నగిరి ఎమ్మెల్యే గాలి భాను, తిరుపతికి చెందిన పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం హోటల్‌లో ప్రత్యేక పూజలను నిర్వహించి, ముఖ్య అతిథిలు హోటల్‌ను ప్రారంభించారు. నిర్వాహకులు మాట్లాడుతూ... డబుల్ హైట్, గ్రాండ్ డ్రాప్ ఆఫ్, మార్బుల్ ఫినిష్, స్టెయిన్ గ్లాస్ అలంకరణతో రిసెప్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 100 సీట్ల సిగ్నేచర్ రెస్టారెంట్, లైవ్ కిచెన్, బఫేతో పాటు 30 సీట్ల సామర్థ్యం గల అల్ఫ్రెస్కో డైనింగ్‌ను సైతం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సాంప్రదాయ రీతిలో వినియోగదారులను ఆకట్టుకునేలా మండపాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్పోర్ట్స్ బార్, స్పా, మల్టీపర్పస్ హాల్, 500 సీట్ల బ్యాంక్వెట్ హాల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు. వేడుకలను జరుపుకునేందుకు ప్రత్యేకంగా స్థలం, రూఫ్ టాప్ ఇన్ఫినిటీ పూల్‌తో పాటు పవిత్ర తిరుమల దృశ్యాల మధ్య ఆహ్లాదకరమైన వసతులు అందిస్తున్నట్లు తెలిపారు.