
దయాదాక్షిణ్యం లేని టీటీడీ
తిరుపతి అన్నమయ్యసర్కిల్: మానవసేవే మాధవసేవ అంటూ ప్రతినిత్యం ప్రచారం చేసే టీటీడీ యాజమాన్యం శ్రీవారి మెట్టు చిరు వ్యాపారుల సమస్యలపై కనీసం దయాదాక్షిణ్యం లేకుండా వ్యవహరిస్తోందని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. టీటీడీ పరిపాలన భవనం వద్ద చేపట్టిన శ్రీవారి మెట్టు చిరు వ్యాపారుల దీక్షా శిబిరాన్ని శుక్రవారం ఆయన సందర్శించి, సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా బాధితులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ చిరు వ్యాపారుల ఉపాధిని టీటీడీ దెబ్బతీయడం ఎంతవరకు సమంజమని ప్రశ్నించారు. శేషాచలం అడవులను అక్రమంగా నరికి వేస్తున్న స్మగ్లర్లని వందల మందిని పట్టించిన వారి ఔదార్యాన్ని గుర్తించాలన్నారు. టీటీడీ అధికారులు చిరువ్యాపారుల కడుపు కొట్టడం దారుణమని విమర్శించారు. టీటీడీ పాలకమండలి, యాజమాన్యం తక్షణం స్పందించి శ్రీవారి మెట్టు వ్యాపారుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని, వారి కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, జిల్లా కార్యదర్శి ఎస్.జయచంద్ర, యూనియన్ నాయకులు మధు, చిట్టిబాబు, చిరంజీవి, గణేషు, యుగంధర్, రాంబాబు, మల్లికార్జున్, ప్రకాష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.