
మొక్కుబడిగా తాత్కాలిక వైద్య సేవలు
తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఉన్న పీహెచ్‌సీలలో వైద్య సేవలు పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో జిల్లా వైద్యశాఖాధికారులు తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
● శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని నాలుగు మండలాలల్లోని పీహెచ్‌సీలలో డాక్టర్ల సమ్మె ఉధృతం కావడంతో ప్రత్యామ్నాయంగా జిల్లా అధికారులు తాత్కాలిక వైద్యులను నియమించారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యులను నియమించినప్పటికీ రోగులు తమకు ఇప్పటికే పరిచయమై వైద్య సేవలు అందించిన వైద్యులు లేకపోవడంతో వెనుదిరగడం కనిపించింది.
● సూళ్లూరు పేట నియోజకవర్గంలో సైతం డాక్టర్ల సమ్మె కారణంగా పీహెచ్‌సీలలో జిల్లా వైద్య శాఖాధికారులు ప్రత్యేకంగా డాక్టర్లు నియమించారు. నియోజకవర్గంలోని 13 నియోజకవర్గాలల్లో వైద్యులను నియమించినప్పటికీ రోగులు రాకపోవడం విశేషం. నాయుడుపేట, దొరవారిసత్రం, ఓజిలి, తడ పీహెచ్‌సీ కేంద్రాలల్లో యథావిధిగా కొనసాగినప్పటికీ గతంలో వచ్చిన విధంగా రోగులు ఆ స్థాయిలో రాలేదు.
–చంద్రగిరి నియోజవర్గంలోనూ అదే పరిస్థితి నెలకొంది. భాకరాపేట పీహెచ్‌సీలో వైద్యులు లేకపోవడంతో రోగులు గంటల తరబడి నిరీక్షించి ఇంటికి వెనుదిరిగారు. తాత్కాలిక వైద్యులు సైతం పీహెచ్‌సీకి సమయానికి రాకపోవడంతో పేద రోగులు స్థానికంగా ఉన్న ప్రైవేటు వైద్యశాలలను సంప్రదించారు. నియోజకవర్గంలోని రామచంద్రాపురం, కుప్పం బాదూరు ప్రాథమిక కేంద్రాలను డీఎంహెచ్‌ఓ సందర్శించి పరిస్థితి సమీక్షించారు
● సత్యవేడు, గూడూరులో దారుణం
గూడూరు మండలం పీహెచ్‌సీలో రోగులు లేక పీహెచ్‌సీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. సాధారణంగా ఒక్కో పీహెచ్‌సీకి రోజుకు సుమారు 100 మందికి పైగా రోగులు వచ్చేవారు. సమ్మెతో కనీసం పదులు సంఖ్యలో కూడా రాలేదు. అలాగే చిల్లకూరు , వల్లిపేడు, చింతవరం, వరగలి పీహెచ్‌సీలో తిరుపతి నుంచి వైద్యులను తాత్కాలికంగా వేసినప్పటికీ ఎక్కడ కూడా వారు బాధ్యతలు చేపట్టలేదు. ఈ ఆసుపత్రిలో సుమారు 80 నుంచి 100 మంది వరకు వైద్య సేవలు పొందుతారు. అలాంటిది పదుల సంఖ్యలో వైద్య సేవలు పొందారు. కోట మండలంలో చిట్టేడు, వాకాడు మండలంలో బాలిరెడ్డి పాలెం చింతోట, వాకాడు మండలంలోని బాలిరెడ్డి పాలెం, చింతోట, నిడుగుర్తిలలో పీహెచ్‌సీలు ఉండగా ఇక్కడ వైద్యులు సమ్మెలో ఉన్నారు. చికిత్స కోసం వచ్చిన రోగులు వెనుదిరగాల్సి వచ్చింది. చిట్టమూరు, మల్లం, గుణపాటి పాలెం, ఈశ్వరవాక పీహెచ్‌సీలు ఉండగా అక్కడా వైద్యులు సమ్మెలో ఉన్నారు. వీరి స్థానంలోకి వైద్య ఆరోగ్య శాఖ తాత్కాలికంగా వైద్యులను పంపి వైద్యం అందిస్తున్నారు. సత్యవేడులోని అన్ని పీహెచ్‌సీ కేంద్రాలలోనూ వైద్యసేవలు స్తంభించి పోయాయి. తూతూ మంత్రంగా కొన్ని కేంద్రాల్లో వైద్యులను నియమించినప్పటికీ రోగులు ఆసుపత్రికి ఆ స్థాయిలో వచ్చిన దాఖలాలు కనిపించలేదు.