
జీఎస్టీ తగ్గింపుతో కుటుంబాలకు ఆదా
శ్రీసిటీ (వరదయ్యపాళెం): రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల పాటు నిర్వహిస్తున్న ‘సూపర్ జీఎస్టీ –సూపర్ సేవింగ్స్’ కార్యక్రమంలో భాగంగా జీఎస్టీ 2.0 ద్వారా కలిగే ప్రయోజనాలను ప్రజలకు, మధ్య, చిన్న తరహా పరిశ్రమలు, కళాకారులు, వ్యాపారులకు వివరించేందుకు శ్రీసిటీలో శుక్రవారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. శ్రీసిటీకి చెందిన వివిధ పరిశ్రమల ప్రతినిధులు, కమ్యూనిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి పరిశ్రమల శాఖ సంయుక్త డైరెక్టర్ చంద్ర శేఖర్ సమావేశ ఉద్దేశాన్ని వివరించారు. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్లు సుబ్బారావు, ప్రవీణ్‌కుమార్ ఈ కార్యక్రమాన్ని నడిపించారు. ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ విజయ్ భారత్ రెడ్డి హాజరై, ఈ కార్యక్రమం దృక్పథాన్ని వివరించారు. సభను ఉద్దేశించి మాట్లాడిన సుబ్బారావు, సూపర్ జీఎస్టీ ద్వారా ప్రతి కుటుంబానికి రూ. 15,000 వరకు ఆదా సాధ్యమవుతోందని, వ్యాపార వృద్ధికి ఇది బలాన్ని ఇస్తుందని తెలిపారు. నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్స్, వాహనాలు, ఆరోగ్య సేవలు వంటి 99 శాతం వస్తువులపై జీఎస్టీ రేట్లు తగ్గించడంతో ఈ ప్రయోజనాలు ప్రజలకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. జీఎస్టీ 2.0 ప్రజా కేంద్రిత విధానాన్ని వివరించారు.