
ఎస్వీయూ అధికారుల తీరుపై ఆగ్రహం
తిరుపతి సిటీ : ఎస్వీయూ అధికారుల తీరుపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి, వర్సిటీలోని సమస్యలపై సోమవారం అన్నమయ్య భనవంలో ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్ సమావేశానికి వర్సిటీ అధికారులు అడ్డకట్ట వేశారు. దీంతో మండిపడిన విద్యార్థి సంఘాల నేతలు యూనివర్సిటీ పరిపాలనా భవనం ఎదుట బైఠాయించి సమావేశం నిర్వహించారు. ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, ఐసా, పీడీఎస్‌ఓ, ఎన్‌ఎస్‌యూఐ, జీఎన్‌ఎస్, జై భారత్ నేషనల్ పార్టీ విద్యార్థి విభాగం సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర యూనివర్సిటీల కో–కన్వీనర్ అశోక్ కుమార్ అధ్యక్షత వహించారు. వారు మాట్లాడుతూ 70 ఏళ్ల విశ్వవిద్యాలయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థి సంఘాలను అణగదొక్కేందుకు వీసీ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు యత్నిస్తున్నారని ఆరోపించారు. నేపాల్ పరిస్థితులను తలపించేలా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వర్సిటీ అధికారుల అవినీతిని బయటపెడుతున్నందుకే సెమినార్ హాల్‌లో రౌండ్ టేబుల్ సమావేశానికి అనుమతి మంజూరు చేయకుండా ఉత్వర్వులు జారీ చేశారని ఆరోపించారు. అధ్యాపకుల లెటర్ ప్యాడ్‌పై మాత్రమే సెమినార్ హాల్ ఇస్తామని చెప్పి, ఎవరైనా అధ్యాపకులు లెటర్ ఇస్తే జీతాలు నిలిపివేస్తామని రిజిసా్‌ట్రర్ బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరు మారకుంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం వీసీకి వినతి పత్రం సమర్పించారు. నేతలు అక్బర్, రవి, ఉదయ్, ప్రవీణ్, మల్లికార్జున, చిన్నా, శివశంకర్‌నాయక్, లోకేష్, భార్గవ్ పాల్గొన్నారు.