
విచ్ఛలవిడిగా లింగనిర్ధారణ పరీక్షలు
పేదల మూఢ నమ్మకాలను ఆసరాగా చేసుకుని శ్రీకాళహస్తి, నాయుడుపేట, గూడూరుల్లో.. లింగ నిర్ధారణ పరీక్షల నిర్వాహకులు బ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. శ్రీకాళహస్తి ప్రాంతంలో బాలికల నిష్పత్తి లింగ నిర్ధారణ పరీక్షల కారణంగానే గణనీయంగా తగ్గిపోతుందన్న విమర్శలు వస్తున్నాయి. శ్రీకాళహస్తి పట్టణంలోని కొన్ని స్కానింగ్ కేంద్రాలు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో లింగ నిర్ధారణ పరీక్షకు రూ. 15 నుంచి రూ. 20 వేలు ఫీజులు తీసుకుంటున్నట్లుగా చెప్పుకుంటున్నారు. అదేవిధంగా నాయుడుపేట, గూడూరు కేంద్రంగా లింగ నిర్ధారణ పరీక్షలు పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు సమాచారం. గూడూరు పట్టణంలోని పేరుగాంచిన ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు విచ్చలవిడిగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వైద్యులు, స్కానింగ్ కేంద్రాలు నడుపుతున్న నిర్వాహకులు లింగ నిర్ధారణ పరీక్షల పేరుతో కోట్లు గడిస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఆ ఫలితమే బ్రూణ హత్యలకు కారణమవుతున్నాయని అంటున్నారు. ఇప్పటికై నా జిల్లా వైద్య యంత్రాంగం అప్రమత్తమై ప్రైవేటు నర్సింగు హోముల్లో, స్కానింగ్ సెంటర్లలో విరివిగా తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.