
ఫీజు బకాయి చెల్లించకపోతే టీసీ ఇవ్వలేమన్న ఎస్వీ ఆర్ట్ కాలేజ్ అధికారులు
తిరుపతి సిటీ: కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోంది. రూ.6,400 కోట్ల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయకుండా పెండింగ్‌లో ఉంచింది. దీంతో వేలాది మంది విద్యార్థులు కాలేజీల నుంచి ధ్రువపత్రాలు పొందలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీలో చోటుచేసుకున్న ఘటన ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. 2024–25 సంవత్సరంలో పీజీ పూర్తి చేసి, బీఈడీ చదవాలనుకున్న విద్యార్థి వినోద్ కుమార్ తన టీసీ కోసం కళాశాలకు వచ్చాడు.
ఫీజు బకాయి ఉందని చెప్పి కాలేజీ అధికారులు అతనికి టీసీ ఇవ్వడానికి నిరాకరించారు. దీనికి నిరసనగా ఆ విద్యార్థి అర్ధనగ్నంగా ప్రిన్సిపాల్ కార్యాలయంలో కూర్చొని ఆందోళన చేశాడు. తన తల్లిదండ్రులు కూలీలని, ప్రభుత్వం స్కాలర్‌షిప్ ఇస్తుందనే నమ్మకంతో కర్నూలు నుంచి వచ్చి ఇక్కడ చదివానని, కళాశాలలో చేరేటప్పుడు కూడా అలాట్‌మెంట్æ కాపీలో ఫీజు ప్రభుత్వం ఇస్తుందని అప్పటి అధికారులు తెలిపారని వాపోయాడు. తీరా చూస్తే ప్రభుత్వం ఇవ్వలేదని కారణం చూపి విద్యార్థుల దగ్గర ముక్కు పిండి వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎస్‌ఎఫ్‌ఐ యూనివర్సిటీల కో–ఆర్డినేటర్ అశోక్ కుమార్ ఇతర విద్యార్థులు వినోద్‌కు మద్దతుగా నిలిచారు.