
హామీలను విస్మరించిన కూటమి
తిరుపతి మంగళం : ఏడాదన్నరకాలం అవుతున్నా ముస్లింలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా చంద్రబాబు మోసం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ముస్లిం, మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్‌బాషా మండిపడ్డారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం పార్టీ ముస్లిం, మైనార్టీ విభాగం జిల్లా సమావేశ నిర్వహించారు. ఈ సందర్బంగా ఖాదర్‌బాషా మాట్లాడుతూ.. తండ్రికి తగ్గ తనయుడిగా ఐదేళ్ల జగనన్న పాలన ముస్లిం, మైనార్టీల సంక్షేమ పాలనగా సాగిందన్నారు. వక్ఫ్‌బోర్డు ఏర్పాటుతో పాటు షాదీ మహళ్లకు చైర్మన్లను నియమించారన్నారు. అనేక సంక్షేమ పథకాలతో ముస్లింల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. అయితే గత ఎన్నికల్లో కూటమి నాయకులు నోటికి వచ్చిన అబద్దపు హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చి ఏడాదన్నరకాలం అవుతున్నా ముస్లింలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా చంద్రబాబు మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ.. జగనన్న పాలనలోనే ముస్లింలకు ఉన్నత స్థానం దక్కిందన్నారు. జగనన్న సాకారంతో తిరుపతిలో ముస్లింలను కార్పొరేటర్లుగా, కో–ఆప్షన్ సభ్యులుగా, షాదీమహల్ చైర్మన్లుగా, నామినేటెడ్ పదవుల్లో మొదటి స్థానం కల్పించిన ఘనత తమదేనని సగర్వంగా చెప్పారు. చంద్రబాబు హామీలు ఇవ్వడం తప్ప వాటిని అమలు చేసిన దాఖలాలే లేవన్నారు. రాబోయే ఎన్నికల్లో ముస్లిం, మైనార్టీలంతా జగనన్నను తిరిగీ ముఖ్యమంత్రిగా చేసుకోవడం కోసం అహర్నిశలు శ్రమిద్దామని కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, తిరుపతి, సత్యవేడు సమన్వయకర్తలు భూమన అభినయ్‌రెడ్డి, నూకతోట రాజేష్, పార్టీ ముస్లిం, మైనార్టీ విభాగం జోనల్ ఇన్‌చార్జ్ సయ్యద్ షఫీ అహ్మద్ ఖాదరీ, నగర అధ్యక్షుడు మహ్మద్ కాసీమ్ బాషా(చోటాబాయ్), కార్పొరేషన్ కో–ఆప్షన్ సభ్యులు రాజేశ్వరి, ఖాదర్‌బాషా, ముస్లిం నాయకులు షేక్ ఇమామ్ బాషా, షేక్ ఇమ్రాన్ బాషా, గఫూర్, చాంధ్‌బాషా, సలీం, షర్మిలతో పాటు జిల్లాలోని నియోజకవర్గాల ముస్లిం నాయకులు పాల్గొన్నారు.