
ఆచూకీ పట్టించిన మందుల చీటీ
అడవిలో బయటపడ్డ మృతదేహాల గుర్తింపు
మృతులు తమిళనాడుకు చెందిన
నాగపట్నం జిల్లా వాసులు
భార్య, బిడ్డల మృతదేహాలను చూసి కుప్పకూలిన భర్త వెంకటేష్
ఆత్మహత్యా? హత్యా? అనే కోణంలో కొనసాగుతున్న విచారణ
పాకాల:అడవిలో బయటపడ్డ మృతదేహాల ఆచూకీ మెడికల్ ప్రిస్కిప్షన్‌తో బహిర్గతమైంది. నాలుగు మృతదేహాలు ఎవ్వరివి అన్న మిస్టరీ వీడింది. మృతులు తమిళనాడు రాష్ట్రం నాగపట్నం జిల్లా పి.కొంతగై గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించి మృతుల కుటుంబీకులకు సమాచారం అందించారు. వివరాలు ఇలా.. నాయుడుపేట– పూతలపుట్టు జాతీయ రహదారిపై గాదంకి టోల్ ప్లాజాకు ఆనుకుని 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న మూలవంక అటవీ ప్రాంతంలో ఈనెల 14వ తేదీన బయటపడ్డ నాలుగు మృతదేహాలను పోలీసులు గుర్తించారు. అడవిలో మృతి చెందిన మహిళ భర్త వెంకటేష్ మంగళవారం పాకాల పోలీస్ స్టేషన్ చేరుకుని తన భార్య బిడ్డలు కనిపించడం లేదని వారి ఫొటోలతో పాటు వివరాలను స్థానిక పోలీసులకు అప్పగించారు. అనంతరం వెంకటేష్‌ను వెంట బెట్టుకుని అడవిలోకి వెళ్లిన పోలీసులు అక్కడ పాతిపెట్టిన గోతులను తవ్వించి అందులో ఉన్న పిల్లల మృతదేహాలను చూపించారు. తన కుమార్తెలు దర్శిని (9), వర్షిణి(3)గా నిర్ధారించుకున్న వెంకటేష్ కన్నీటి పర్యంతమై అక్కడే కుప్పకూలిపోయాడు. పోలీసులు అతడిని ఓదార్చి ధైర్యం చెప్పి ఆ తరువాత పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పిల్లలను పాతిపెట్టిన గోతుల్లో మృతదేహాలతో పాటు ఒక సెల్‌ఫోన్, ఆధార్, పాన్ కార్డులు, చాక్లెట్లు బయటపడగా వాటి ఆధారంగా తన భార్య జయమాల, ఆమె సోదరుడు కలై సెల్వంగా వెంకటేష్ గుర్తించాడు.
ఇక్కడకి ఎలా వచ్చారు?
ఎక్కడో నాగపట్ల జిల్లా నుంచి పనపాకం సమీపంలోని అడవుల్లోకి ఎలా వచ్చారు.. ఎలా చనిపోయారు అనే విషయంలో నెలకొన్న అనుమానాలు మాత్రం తీరడం లేదు. తమ వెంట తీసుకొచ్చిన పిల్లలను చంపి పాతిపెట్టిన తరువాత వారు ఆత్మహత్య చేసుకున్నారా..? లేదా ఫైనాన్స్ గొడవల్లో ఎవ్వరైనా ఆ నలుగురుని కిడ్నాప్ చేసి చంపి అడవిలో ఆత్మహత్యలా చిత్రీకరణ చేశారా..? జయమాల, కలై సెల్వన్‌ల మృత దేహాల మూతులకు గుడ్డలు కట్టి ప్లాస్టర్ వేసి ఉన్నందున హత్య చేశారన్న అనుమానాలకు బలం చేకూరుతోంది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నందున త్వరలో నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
మృతదేహాలకు అక్కడే శవపరీక్ష, ఖననం
అడవిలో నుంచి మృత దేహాలను కదిలించలేని దుస్థితిలో ఉన్నందున పోలీసులు తహసీల్దారు సమక్షంలో వైద్యులను తీసుకువెళ్లి అక్కడే పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యుల సమక్షంలో పంచనామా నిర్వహించి ఖననం చేశారు. అసలు ఆ కుటుంబంలో జయమాల, కలై సెల్వంల మధ్యన సంబంధాలు ఏమిటి అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్టు సమాచారం.
చీటీ ఆధారంగా చిరునామా గుర్తింపు
నాలుగు మృతదేహాల మిస్టరీ ఛేదించడంలో మెడికల్ ప్రిస్కిప్షన్ కీలకమైంది. అడవిలోని మృత దేహాల వద్ద లభించిన హాస్పిటల్ ప్రిస్కిప్షన్ ఆధారంగా పోలీసులు హాస్పిటల్ ఫోన్ నంబర్‌కి ఫోన్ చేసి వివరాలు తెలిపారు. తంజావూరులోని ఆసుపత్రి వారు అక్కడి మెడికల్ రికార్డుల్లోని చిరునామా ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని చేరవేశారు. ఆ విషయం తెలుసుకున్న వెంకటేష్ పాకాల పోలీస్ స్టేషన్ కు చేరుకుని తన భార్య, పిల్లల ఫొటోలను చూపించగా అతడిని ఘటనా స్థలికి తీసుకువెళ్లి నిర్ధారణ చేసుకున్నారు.
అసలేం జరిగిందంటే..?
జయమాల భర్త వెంకటేష్ కువైట్లో పనిచేస్తుండగా జయమాల తన ఇద్దరు పిల్లలు దర్శిని (9), వర్షిణి (3)లతో పి.కొంతగై గ్రామంలోనే ఉండేవారు. కువైట్ నుంచి అప్పుడప్పుడూ రూ.50 వేలు, రూ.60 వేలు తన భార్య జయమాలకు పంపించేవారు. ఆ డబ్బును జయమాల తన పెద్దమ్మ కుమారుడైన కలై సెల్వంతో కలిసి ఫైనాన్స్ చేస్తుండేది. ఆ ఫైనాన్స్ వ్యాపారంలో డబ్బులు పోగొట్టుకుని పూర్తిగా నష్టపోయారు. ఈ క్రమంలో వెంకటేష్ 2024 జూన్ నెలలో కువైట్ నుంచి ఇంటికి వచ్చాడు. అదే రోజున తన భార్య జయమాలను తాను పంపించిన డబ్బులు ఏం చేశావని అడిగ్గా జయమాల దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రాక పోవడంతో గొడవపడి అతడు తిరిగీ కువైట్‌కు వెళ్లిపోయాడు. 2025 జూలై నెలలో తన భార్య పిల్లలు కనిపించడం లేదని విషయం తెలుసుకున్న వెంకటేష్ కువైట్ నుంచి స్వగ్రామానికి వచ్చి బంధువులు, స్నేహితులను విచారించాడు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో తన భార్య, పిల్లలు కనిపించడం లేదని నాగపట్నం జిల్లా తిక్కచేరీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అక్కడి పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.

ఆచూకీ పట్టించిన మందుల చీటీ

ఆచూకీ పట్టించిన మందుల చీటీ