
టీచర్లకు బోధనేతర పనులు వద్దు
తిరుపతి సిటీ: స్కూళ్లలో టీచర్లకు విపరీతంగా పెరిగిపోయిన బోధనేతర పనులను రద్దు చేసి వారి సమయాన్ని బోధనకే పరిమితం చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్ ప్రసాద్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానికంగా ఓ హోటల్‌లో యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తలపెట్టిన రణభేరి–ప్రచార బైక్ జాతా నిర్వహించి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 13 వేలకు పైగా పాఠశాలలు ఏకోపాధ్యాయులతో నడుస్తున్నాయని, ఒక ఉపాధ్యాయుడు ఐదు తరగతులకు బోధన చేయడమే ఇబ్బందిగా ఉన్న పరిస్థితుల్లో, పలు రకాల బోధనేతర పనులను అప్పగించడం దారుణమని, ఆ పనులను వివరించారు. వీటి నుంచి విముక్తి కల్పించి స్వేచ్ఛాయుత వాతావరణంలో పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించడానికి అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌ఎస్ నాయుడు, తిరుపతి, చిత్తూరు జిల్లాల ప్రధాన కార్యదర్శులు ముత్యాలరెడ్డి, మణిగంఠన్, దేవరాల నిర్మల, జిల్లా గౌరవాధ్యక్షులు దండు రామచంద్రయ్య, వయ్యాల మధు, బండి మధుసూదన్ రెడ్డి, అవనిగడ్డ పద్మజ, మోహన్, చీళ్ల సురేష్, హేమాద్రిబాబు,వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు.