
మహిళా వర్సిటీని సందర్శించిన థాయిలాండ్ బృందం
తిరుపతి రూరల్ : శ్రీపద్మావతీ మహిళా యూనివర్సిటీని థాయిలాండ్‌లోని ప్రిన్స్ ఆఫ్ సాంగ్‌క్లా యూనివర్సిటీ పట్టాని క్యాంపస్ ప్రతినిధి బృందం మంగళవారం సందర్శించింది. యూనివర్సిటీ ఉప కులపతి ప్రొఫెసర్ వి.ఉమ, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎన్.రజని, అంతర్జాతీయ సంబంధాల విభాగం డీన్ ప్రొఫెసర్ పి.విజయలక్ష్మి, అసోసియేట్ డీన్ ప్రొఫెసర్ ఆర్.ఉష విదేశీ బృందానికి స్వాగతం పలికారు. అనంతరం రెండు విశ్వ విద్యాలయాల అధ్యాపకుల మధ్య సమగ్ర చర్చలు జరిగాయి. ఇందులో సంయుక్త పరిశోధన, సామూహిక ప్రచురణలు (జాయింట్ పబ్లికేషన్), విద్యార్థుల , అధ్యాపకుల మార్పిడి కార్యక్రమాలపై చర్చించారు. అంతర్జాతీయ విద్యా ప్రమాణాల పరిశీలన, పరస్పర సహకారం కోసం ప్రత్యేక సమావేశాన్ని యూనివర్సిటీ అధికారులు నిర్వహించారు. రెండు విశ్వవిద్యాలయాల మధ్య విద్యా, పరిశోధన సహకారాన్ని అభివృద్ధి చేయడమే ప్రధాన ఉద్దేశంగా ఆ సమావేశం సాగింది. మహిళల సాధికారత కోసం చేస్తున్న సేవలను ప్రశంసించడంతో పాటు ఈ తరహా కార్యక్రమాలను థాయిలాండ్‌లోనూ అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. చివరగా రెండు యూనివర్శిటీల మధ్యన ఒప్పందాలకు అంగీకారం కుదుర్చుకున్నట్టు వీసీ వి.ఉమ స్పష్టం చేశారు.