విమానాశ్రయంలో ‘యాత్రసేవా దివస్‌’ నేడు | - | Sakshi
Sakshi News home page

విమానాశ్రయంలో ‘యాత్రసేవా దివస్‌’ నేడు

Sep 17 2025 7:51 AM | Updated on Sep 17 2025 7:51 AM

విమాన

విమానాశ్రయంలో ‘యాత్రసేవా దివస్‌’ నేడు

ఏర్పేడు/రేణిగుంట : తిరుపతి విమానాశ్రయంలో బుధవారం ‘యాత్ర సేవా దివస్‌’ వేడుకలు నిర్వహించనున్నట్లు ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ బూమినాథన్‌ తెలిపారు. మంగళవారం రేణిగుంట సమీపంలోని ఎయిర్‌పోర్ట్‌లో ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆదేశాల మేరకు తిరుపతి విమానాశ్రయంలో ప్రయాణికులతో కలసి ఈ సంబరాలు చేయబోతున్నట్లు తెలిపారు. రాష్ట్ర సాంస్కృతిక కళ ఉట్టిపడేలా తిరుపతి ఎస్‌వీ సంగీత కళాశాల విద్యార్థులతో నృత్య ప్రదర్శన, ఎయిర్‌పోర్ట్‌ ఆవరణలో ప్రయాణికులు, సీనియర్‌ సిటిజన్లతో మొక్కలు నాటించే కార్యక్రమం, తిరుపతి రోటరీ క్లబ్‌తో కలసి రక్తదాన శిబిరం, ప్రయాణికులకు ఉచిత వైద్యశిబిరం నిర్వహించి రక్త పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే ఆటో, టాక్సీ డ్రైవర్లకు ఉచిత కంటి వైద్యశిబిరం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పిల్లలకు క్విజ్‌, పెయింటింగ్‌ పోటీలు, ఫొటో, సెల్ఫీ బూత్‌లను ఏర్పాటు చేసి వారి ఫొటోలను, అభిప్రాయాలను తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ అధికారిక సోషల్‌ మీడియా సైట్లలో పోస్ట్‌ చేస్తామన్నారు. సమావేశంలో ఎయిర్‌పోర్ట్‌ హెచ్‌ఆర్‌ సీనియర్‌ మేనేజర్‌ కశ్యప్‌, సీనియర్‌ టెర్మినల్‌ మేనేజర్‌ మణిదీప్‌, ఆపరేషన్స్‌ మేనేజర్‌ ప్రణయ్‌ పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి ఆలయ

ఉద్యోగుల సస్పెన్షన్‌

శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరాలయ సూపరింటెండెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ను సస్పెండ్‌ చేస్తూ ఈఓ బాపిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. స్కిట్‌ కళాశాల కోర్టు కేసుల వ్యవహారంలో బాధ్యతాయుతంగా వ్యవహారించకపోవడంతో వారిపై చర్యలు తీసుకున్నట్లు జీవోలో పేర్కొన్నారు. దానివల్ల కోర్టు ధిక్కారణ కేసులు నమోదయ్యాయని ఈ నేపథ్యంలో దేవాదాయశాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్‌ చేసి ఏఈవోకు మెమో ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై చర్యలు లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఆర్‌ సెట్‌ కన్వీనర్‌గా ఉష

తిరుపతి రూరల్‌ : ఏపీ రీసర్చ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఆర్‌ టెస్ట్‌) 2024 కన్వీనర్‌గా శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం బయో టెక్నాలజీ విభాగం ప్రొఫెసర్‌ ఆర్‌.ఉషను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఎంపిక చేసింది. అదే విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ జాన్‌ సుష్మాను కో కన్వీనర్‌గా నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఆర్‌ సెట్‌ ద్వారా వివిధ సబ్జెక్టులలో పీహెచ్‌డీ ప్రోగ్రాంలో ప్రవేశానికి పరీక్షలను నిర్వహించనున్నారు. ఏపీఎస్‌హెచ్‌ఇ గుర్తింపు పొందిన ఏజెన్సీ ద్వారా ఆన్‌లైన్‌లో ఆ పరీక్షను నిర్వహించనున్నారు.

రైల్వే టికెట్‌ బుకింగ్‌లో మార్పులు

తిరుపతి అన్నమయ్యసర్కిల్‌ : ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ టికెట్‌ బుకింగ్‌ వ్యవస్థలో రైల్వేశాఖ సరికొత్త మార్పును తీసుకొచ్చింది. అక్టోబర్‌ 1 నుంచి ఆధార్‌ ధ్రువీకరణ పూర్తయిన వ్యక్తులు మాత్రమే రిజర్వేషన్‌ ప్రారంభమైన తర్వాత మొదటి 15 నిమిషాల్లో ఆన్‌న్‌లైన్‌ లో టిక్కెట్లు బుక్‌ చేసుకునే అవకాశం కల్పించనుంది. ఈ నియమం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌ రెండింటిలోనూ వర్తిస్తుంది. ప్రస్తుతం ఇది తత్కాల్‌ బుకింగ్‌ విధానంలో అమల్లో ఉంది. అక్టోబర్‌ 1 నుంచి సాధారణ రిజర్వేషన్లకు కూడా వర్తిస్తుందని రైల్వే అధికార వర్గాలు పేర్కొన్నాయి.

పార్లమెంటరీ విధానాలను బలోపేతం చేయాలి

తిరుపతి కల్చరల్‌ : మెరుగైన పారదర్శకత, జవాబుదారీతనం కోసం పార్లమెంటరీ విధానాలను బలోపేతం చేయాలని పార్లమెంట్‌ సభ్యుడు, రాజ్యసభ కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ లక్ష్మీకాంత్‌ బాజ్‌పాయ్‌ పిలుపు నిచ్చారు. మంగళవారం ఓ ప్రవేటు హోటల్లో రాజ్యసభ కమిటీ అధ్యయన యాత్ర నిర్వహించారు. ఇందులో ఎంపీలు బహువా మాజీ, రాఘవ్‌ చద్దా, రాంభాయ్‌ హెచ్‌, మోకారియా, నారాయణ కొరగప్ప, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఈడీ సంజయ్‌ రుద్ర, సీఈవో అవినాష్‌ ప్రభు, తిరుపతి జోనల్‌ హెడ్‌ పత్రి శ్రీనివాస్‌కుమార్‌, తిరుపతి డిప్యూటీ జోనల్‌ హెడ్‌ వీకే కిషోర్‌, సీనియర్‌ బ్యాంక్‌ అధికారులు, ఐఐటీ, తిరుపతి ఐఐఎస్‌ఈఆర్‌, సీఐసీ ,సంస్కృత వర్శిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

విమానాశ్రయంలో  ‘యాత్రసేవా దివస్‌’ నేడు 1
1/3

విమానాశ్రయంలో ‘యాత్రసేవా దివస్‌’ నేడు

విమానాశ్రయంలో  ‘యాత్రసేవా దివస్‌’ నేడు 2
2/3

విమానాశ్రయంలో ‘యాత్రసేవా దివస్‌’ నేడు

విమానాశ్రయంలో  ‘యాత్రసేవా దివస్‌’ నేడు 3
3/3

విమానాశ్రయంలో ‘యాత్రసేవా దివస్‌’ నేడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement