
బైక్ దొంగలు అరెస్టు
తడ: మండలంలో తరచూ జరుగుతున్న ద్విచక్ర వాహనాల చోరీకి సంబంధించి పోలీసులు మంగళవారం ఐదుగురు నిందితులను అరెస్టు చెయ్యడంతో పాటు 11 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి సూళ్లూరుపేట సీఐ మురళీకృష్ణ మంగళవారం తడ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఇటీవల తడలో పట్టుబడిన కొన్ని ద్విచక్ర వాహనాలకు సంబంధించి విచారణలో భాగంగా తనిఖీలు నిర్వహించిన పోలీసులకు నిందితుల ఆచూకీ లభించింది. ఆ మేరకు తడ ఎస్‌ఐ కొండపనాయుడు ఆధ్వర్యంలో వలపన్నిన పోలీసులు ఇప్పటికే రౌడీ షీటర్‌గా ఉన్న సాయి విగ్నేష్‌తో పాటు తడ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన రాకేష్, గోపాల్, మునిశేఖర్, సూర్యనారాయణ అనే నిందితులను అరెస్టు చేసి వారివద్ద నుంచి విక్రయానికి సిద్ధంగా ఉన్న, ఇప్పటికే విక్రయించిన మరికొన్ని బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. వీరికి సహకరించిన వంశీతో పాటు మరో వ్యక్తి ఇప్పటికే మరో కేసులో నెల్లూరు జైలులో ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ ఐదు మందిని అరెస్టు చేసినట్టు తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐ కొండపనాయుడు, ఏఎస్‌ఐ శ్రీకుమార్‌రెడ్డి, సిబ్బంది ఉన్నారు.
డీసీఎంఎస్ చైర్మన్ మృతి
చంద్రగిరి : తిరుపతి, చిత్తూరు జిల్లాల డీసీఎంఎస్ చైర్మన్, టీడీపీ సీనియర్ నేత పల్లినేని సుబ్రమణ్యం నాయుడు (51) అనారోగ్యంతో చైన్నెలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పులివర్తి నాని చైన్నెకు చేరుకుని, మృతదేహాన్ని స్వగ్రామం పనపాకం పంచాయతీ గడ్డంవారిపల్లికు మంగళవారం మధ్యాహ్నం తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఆటో బోల్తా : ఆరుగురికి గాయాలు
శ్రీకాళహస్తి : పట్టణంలోని భరద్వాజ తీర్థం వద్ద ఆటో బోల్తా పడి ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. నెల్లూరుకు చెందిన కుటుంబ సభ్యులు శ్రీకాళహస్తిలో బంధువుల ఇంటికి జన్మదిన వేడుకలు కోసం వచ్చారు. వేడుకల అనంతరం లోబావి (భరద్వాజతీర్థం) సందర్శించి తిరుగు ప్రయాణం అయ్యారు. ఇంతలో కన్నప్ప కొండ వద్ద ఆటో అదుపు తప్పడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రెహనా (50), కరిష్మా (22), భాను (23), జాకీర్ (23), ఆశా బేగం (65), మహమ్మద్ అలీ (8) గాయాలయ్యాయి. వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్సలు చేయిస్తున్నారు.

బైక్ దొంగలు అరెస్టు