
గుట్టుగా రైతుల భూములు టీడీపీ నేతల పరం!
నిలదీసిన రైతులపై చిందులేసిన
తహసీల్దార్
ఆర్డీఓ వద్ద తేల్చుకోవాలంటూ ఉచిత సలహా
అంతటితో ఆగక బాధితుల్ని పోలీసులకు అప్పగించిన వైనం
తహసీల్దార్ తీరుపై మండిపడుతున్న
రైతు నేతలు
కేవీబీపురం: తమకు అధికారులు అన్యాయం చేసారని తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన బాధిత రైతులను సాక్షాత్తు తహసీల్దారే పోలీసులకు అప్పగించి వేధింపు చర్యలకు పాల్పడడం చర్చనీయాంశమైంది. వివరాలు..మండలంలోని తిమ్మసముద్రం గ్రామానికి చెందిన రైతులు రమణయ్య నాయుడు, చెంచు కృష్ణారెడ్డి, వెంకటముని స్థానికంగా పట్టా భూమి కలిగి ఉన్నారు. ఆ భూమిలో దాదాపు 3 దశాబ్దాలుగా వ్యవసాయం చేస్తున్నారు. అయితే గత నెల వరకూ రైతుల పేరిటే ఉన్న ఆ భూములు ఈ నెల 2వ తేది తరువాత స్థానిక టీడీపీ నేతల పేరిట మారిపోయాయి! ఇది తెలుసుకున్న బాధిత రైతులు అధికారులకు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోవడంతో మీడియాను ఆశ్రయించారు. మీడియా వారి సమస్యను గత శనివారం వెలుగులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో మంగళవారం బాధితులు తహసీల్దార్ రోశయ్య, వీఆర్‌ఓ మనోహర్‌ను నిలదీశారు. దీంతో వారు రైతులపై చిందులేశారు. ఏమైనా ఉంటే ఆర్‌డీఓ దగ్గర తేల్చుకోవాలని, మీడియాను ఎవరు కలవమన్నారంటూ ఎదురుదాడికి దిగారు. అంతటితో ఆగకుండా జరుగుతున్న తతంగాన్ని సెల్‌ఫోన్‌లో రికార్డు చేస్తున్నారనే నెపంతో రైతు వెంకటముని కుమారుడైన మునిరత్నం ఫోన్‌ను తహసీల్దార్ బలప్రయోగంతో లాక్కున్నారు. అంతటితో ఆగకుండా వారిని తహసీల్దార్ పోలీసులకు అప్పగించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిని సాయంత్రం వరకు అక్కడే ఉంచారు. తహసీల్దార్ తమ భూములను భూములను టీడీపీ నేతలకు అప్పగించడమే కాకుండా, తమను బెదిరించడం శోచనీయమని, దీనిపై ఆర్డీఓ, జిల్లా కలెక్టర్ దృష్టి సారించి తమకు న్యాయం చేయాలని బాధిత రైతులు విజ్ఞప్తి చేశారు.
సీఎం చెప్పేదొకటి..ఆచరణలో మరొకటి
ఇదలా ఉంచితే, రైతుల ప్రమేయం లేకుండా వారి భూములను రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి అధికార పార్టీ నేతలకు అప్పగించడం వెనుక రెవెన్యూ అధికారుల హస్తం ఉన్నట్టు స్పష్టంగా తేలుతున్నా , పుండు మీద కారం చల్లినట్లు బాధితులనే వేధించడం విమర్శలకు తావిచ్చింది. రైతులను రారాజు చేయడమే తన లక్ష్యమని సీఎం చంద్రబాబునాయుడు ఆర్భాటంగా ప్రకటించినా, రైతుల కడుపు కొట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం, నాయకుల తీరు ఉంటోందని పలువురు రైతు నాయకులు విమర్శించారు.

గుట్టుగా రైతుల భూములు టీడీపీ నేతల పరం!