
తిరుపతికి ప్రత్యేక రైళ్లు
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : శ్రీవారి బ్రహ్మోత్సవాలు, దసరా, దీపావళి పర్వదినాలను పురస్కరించుకుని తిరుపతి ప్రత్యేక రైళ్లు నడిపేందుకు రైల్వేశాఖ నిర్ణయించింది. సోమవారం ఈ మేరకు వైజాగ్–తిరుపతి ప్రత్యేక రైలు ప్రారంభమైంది. నవంబర్ 25వ తేదీ వరకు ఈ రైలు ప్రతి మంగళవారం తిరుపతిలో విశాఖపట్నం వెళ్లేందుకు అందుబాటులో ఉండనుంది. అలాగే అక్టోబర్ 5 నుంచి 27వ తేదీ వరకు తిరుపతి– అనకాపల్లి మధ్య 8 స్పెషల్ ట్రైన్లు నడిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఇప్పటికే రాకపోకలు సాగిస్తున్న ప్రత్యేక రైళ్లను దసరా, దీపావళి సెలవులు పూర్తయ్యే వరకు కొనసాగించనున్నారు. నడికుడి– శ్రీకాళహస్తి నుంచి తిరుపతి నడిచే రైళ్లను సైతం కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మరిన్ని రైళ్లను ప్రకటించేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది.
స్విమ్మింగ్, తైక్వాండో
జిల్లా జట్ల ఎంపిక రేపు
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆవరణలో ఉమ్మడి జిల్లా అండర్–14, 17, 19 బాలబాలికలకు స్విమ్మింగ్, తైక్వాండో జట్ల ఎంపిక పోటీలు బుధవారం నిర్వహించనున్నారు. సోమవారం ఈ మేరకు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) జిల్లా కార్యదర్శి పి.కిషోర్ కుమార్, మహిళా కార్యదర్శి ఎల్.భార్గవి తెలిపారు. పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు వయసు ధ్రువీకరణ పత్రం, ఇంటర్ విద్యార్థులు పదో తరగతి ఒరిజినల్ మార్క్స్ లిస్టు తీసుకురావాలని సూచించారు. ఇతర వివరాలకు స్విమ్మింగ్–81217 77077, తైక్వాండో– 90329 56111నంబర్లలో సంప్రదించాలని కోరారు.
‘యువ తరంగ్’ పోస్టర్ ఆవిష్కరణ
తిరుపతి సిటీ : ఎస్వీయూ స్టూడెంట్ వెల్ఫేర్–కల్చరల్ అఫైర్స్ విభాగం ఆధ్వర్యంలో అక్టోబర్ 16వ తేదీ నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్న యువ తరంగ్–2025 కార్యక్రమ పోస్టర్‌ను వీసీ అప్పారావు సోమవారం ఆవిష్కరించారు. వీసీ మాట్లాడుతూ వర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ, పీజీ కళాశాలల విద్యార్థులకు సాంస్కృతిక పోటీలు ఉంటాయని వెల్లడించారు. వక్తృత్వ, సంగీతం, నృత్య, థియేటర్ ఆర్ట్స్ వంటి 10 విభాగాలలో పోటీలను నిర్వహించి ప్రతిభావంతులను ఎంపిక చేస్తామని వివరించారు. రిజిస్ట్రార్ భూపతి నాయుడు, శాప్ చైర్మన్ రవినాయుడు, కల్చరల్ విభాగం డైరెక్టర్ మురళీధర్, డాక్టర్ పత్తిపాటి వివేక్, పీసీ వెంకటేశర్లు, ప్రిన్సిపల్ పద్మావతి, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, సుబ్బారావు, వరదరాజన్ విజయసారథిరెడ్డి, డాక్టర్ పాకనాటి హరికృష్ణ పాల్గొన్నారు.
22 నుంచి ‘కోన’లో శరన్నవరాత్రి
రాపూరు : మండలంలోని పెంచలకోనలో ఆదిలక్ష్మీదేవికి ఈ నెల 22 నుంచి అక్టోబర్2వ తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. 22న సౌభాగ్యలక్ష్మీదేవి, 23న ఆదిలక్ష్మీదేవి ,24న ధాన్యలక్ష్మి, 25న ధైర్యలక్ష్మి ,26న గజలక్ష్మి, 27న సంతానలక్ష్మి, 28న విజయలక్ష్మి, 29న విద్యాలక్ష్మి, 30న రాజ్యలక్ష్మి, అక్టోబర్ 1న ధనలక్ష్మి అలంకరణలో అమ్మవారు దర్శనమివ్వనున్నట్లు వివరించారు. 2న విజయదశమి సందర్బంగా లక్ష్మీనరసింహస్వామికి అభిషేకం, పూలంగిసేవ, ఉదయం8.30కు అశ్వవాహనంపై శ్రీవారి పారువేట, 9గంటలకు శమీపత్రపూజ, 11గంటలకు కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు అమ్మవారికి ఉదయం నవ కలశ స్నపన తిరుమంజనం, సాయంత్రం 6 గంటలకు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, క్షేత్రోత్సవం ఉంటుందని తెలిపారు.

తిరుపతికి ప్రత్యేక రైళ్లు

తిరుపతికి ప్రత్యేక రైళ్లు