
డిజిటల్ యుగంలో మహిళలు కీలకం
తిరుపతి అర్బన్ : డిజిటల్ యుగంలో మహిళలు కీలకమని, కొత్త సాంకేతిక సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగాలని లోకసభ స్పీకర్ ఓంబిర్లా పిలుపునిచ్చారు. జాతీయ మహిళా సాధికారత సదస్సు సోమవారంతో ముగిసింది. ఈ క్రమంలో ముందుగా తిరుచానూరులోని రాహుల్ కన్వెన్షన్ సెంటర్‌లో రెండో రోజు సదస్సును జాతీయ, రాష్ట్ర గీతాలాపనలతో ప్రారంభించారు. అనంతరం గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను సత్కరించి, శ్రీరామ పట్టాభిషేకం చిత్ర పటం బహుకరించారు. లోకసభ స్పీకర్ మాట్లాడుతూ భారత్ అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేరాలంటే మహిళలు వందశాతం విద్యావకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. తిరుపతిలో జాతీయ మహిళా సాధికారత తొలి సమావేశం నిర్వహించడం ఎంతో సంతృప్తిగా ఉందని వెల్లడించారు.
రాజ్యసభ ఉపాధ్యక్షుడు హరివంశ్ నారాయణ సింగ్ మాట్లాడుతూ ఒక మహిళను విద్యావంతురాలిని చేస్తే, ఒక తరం విద్యావంతమవుతుందని సావిత్రిబాయి ఫూలే చెప్పిన మాటలు అక్షర సత్యమన్నారు. దుర్గాబాయి దేశ్‌ముఖ్ మహిళా హక్కుల కోసం పోరాడి, పురుషుల కంటే మంచి నిర్వాహకులుగా నిరూపించారని గుర్తుచేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ మహిళలు రాజకీయ,విజ్ఞానం,సాంకేతికత, వైద్యం,న్యాయరంగాల్లో సాధించిన విజయాలను వివరించారు. శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ మహిళల సమాన హక్కులు,రాజకీయాలలో మరింత ప్రాతినిధ్యం,విద్య, ఉపాధి, ఆర్థిక రంగాలలో అవకాశాలు,సురక్షిత సమాజ నిర్మాణం ఇవన్నీ లక్ష్యాలుగా వెల్లడించారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ లింగ సమానత్వం సాధనలో పురోగతి అవసరమని గుర్తుచేశారు. పలువురు మహిళా సభ్యులు మాట్లాడుతూ సదస్సు నిర్వహణకు పార్లమెంటరీ కమిటీ, సెక్రటేరియట్ టీమ్స్, అధికారుల సహకారం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, శాసనమండలి డిప్యూటీ చైర్ పర్సన్ ఎమ్. జకియా కానం, మహిళా సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్ గౌరు చరితారెడ్డి, శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్య దేవర, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తదితరులు పాల్గొన్నారు.

డిజిటల్ యుగంలో మహిళలు కీలకం