
నకిలీ మీడియాను అరికట్టేందుకే స్టిక్కర్ల పంపిణీ
తిరుపతి క్రైమ్: జిల్లా వ్యాప్తంగా నకిలీ మీడియాను అరికట్టేందుకు ప్రస్తుతం వర్కింగ్ జర్నలిస్టులందరికీ స్టిక్కర్లను పంపిణీ చేశామని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఆయన శుక్రవారం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు స్టిక్కర్లను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేసే వాళ్లు కూడా మీడియా ప్రతినిధులుగా చెలామణి అవుతున్నారని తెలిపారు. అంతేకాకుండా చాలామంది వాహనాలపై ప్రెస్, పోలీస్ స్టిక్కర్లు అంటించుకుని తిరుగుతున్నారని తెలిపారు. దీనిపై స్పెషల్ డ్రైవ్ చేపట్టి కొన్ని వందల వాహనాలకు స్టిక్కర్లు తొలగించామన్నారు. నిజాయితీగా వర్కింగ్ జర్నలిస్ట్‌గా ఉన్న వారందరికీ గుర్తింపు ఇచ్చేందుకు పోలీస్ విభాగం తరఫున ద్విచక్ర వాహనాలు, కార్లకు స్టిక్కర్లను పంపిణీ చేశామన్నారు. ఈ స్టిక్కర్ తగిలించుకున్న మీడియా ప్రతినిధులు ఎలాంటి ప్రోగ్రాములకై నా పోలీసుల ద్వారా ఇబ్బంది లేకుండా అనుమతి ఇస్తామన్నారు. అంతేకాకుండా ఈ స్టిక్కర్ స్కాన్ చేస్తే ఆ మీడియా ప్రతినిధి వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు. రాత్రి సమయంలో ఎడిషన్‌లో పనిచేసే పాత్రికేయుల వాహనాలకు వున్న ఈ స్టిక్కర్లను చూసి పోలీసులు అనుమతి ఇస్తారని వెల్లడించారు. ఈ స్టిక్కర్లను కాపీ చేయకుండా పకడ్బందీగా తయారు చేశామన్నారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ మురళి, సెక్రటరీ బాలచంద్ర తదితరులు పాల్గొన్నారు.