
కాలువ ఆధునీకరణ పనులపై నివేదిక ఇవ్వండి
వరదయ్యపాళెం: శ్రీసిటీ మీదుగా వెళ్లే ఇరిగేషన్‌కు చెందిన కరిపేటి కాలువ ఆధునీకరణ పనులకు సంబంధించి పూర్తి స్థాయి నివేదికను అందజేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం శ్రీసిటీలోని కరిపేటి కాలువను కలెక్టర్ సందర్శించారు. ఇటీవల శ్రీసిటీలోని ట్రిపుల్ ఐటీ కళాశాల సమీపంలో కరిపేటి కాలువ సంబంధించి శ్రీసిటీ యాజమాన్యం కాలువ పూడికతీత పనులతో పాటు కట్టను బలోపేతం చేసే పనులను చేపట్టారు. అయితే ఈ పనులకు సంబంధించి అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాలువలో పూడికతీత పనులకు సంబంధించి తవ్విన మట్టిని బయటకు తరలిస్తున్నారని కేవీబీపురం మండలం మద్రాసు బాబు హైకోర్టులో కేసు వేశారు. దీనిపై కోర్టు ఆదేశాల మేరకు పూర్తి వివరాలను అందించాలని కలెక్టర్‌కు సూచించడంతో ఆయన పనులు జరిగిన కరిపేటి కాలువను సందర్శించి వివరాలు సేకరించారు. అనంతరం శ్రీసిటీ పరిధిలోని ఈస్ట్ మల్లవారిపాళెం చెరువును పరిశీలించారు.