
నేషనల్ హైవే భూ సర్వే
రేణిగుంట: మండలంలోని గాజులమండ్యంలో ఉన్న తిరుపతి–చైన్నె నేషనల్ హైవేకు సంబంధించి బుధవారం రెవెన్యూ అధికారులు, హైవే అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించారు. నేషనల్ హైవే భూ సేకరణలో భాగంగా గ్రామంలో 200 అడుగుల వెడల్పు ప్రకారం గతంలో సర్వే నిర్వహించి నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించారు. కొందరు నష్టపరిహారం తీసుకున్నప్పటికీ ఆ స్థలాన్ని వదులుకోలేదు. దీంతో తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సర్వే చేసి రెండు రోజుల్లో స్థలాలు ఖాళీ చేసి, హైవే అధికారులకు అప్పగించాలని ఆదేశించారు. అదేవిధంగా గ్రామ పెద్దలతో కృష్ణ మందిరం, సాయిబాబా మందిరం తొలగింపుపై చర్చించారు. దేవాలయాలను మరొకచోటకి మార్చేందుకు సమ్మతించారు.
డీ అడిక్షన్ సెంటర్ల నిర్మాణం అవసరం
తిరుపతి తుడా: మాదక ద్రవ్యాల వ్యసనం నుంచి బయట పడడానికి ప్రధాన చికిత్స అయిన డీ అడిక్షన్ సెంటర్ల నిర్మాణం అవసరమని తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ తెలిపారు.జిల్లా ఆరోగ్యశాఖ కార్యాలయంలో బుధవారం ఆయన వైద్యులు, ఎన్‌జీఓల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వ్యసనం అనేది ఒక తీవ్రమైన సమస్య అని ఇది ఒక వ్యక్తి మెదడు, ప్రవర్తనను ప్రభావితం చేసే వ్యాధి అని తెలిపారు. మద్యపానం, గంజాయి, కొకై న్, నికోటిన్ వంటి మాదక ద్రవ్యాలు మెదడు పై ప్రభావం చూపి స్వీయ నియంత్రణను బలహీన పరుస్తుందని అన్నారు. ఇలాంటి సమస్య నుంచి బయటపడాలంటే మెడికల్ కేర్, సైకలాజికల్ ట్రీట్‌మెంట్ అవసరమని, ఆ దిశగా బాధితులను ప్రోత్సహించాలని తెలిపారు. సమావేశంలో డీపీఎంఓ డాక్టర్ శ్రీనివాసరావ్, ఏఓ డాక్టర్ మురళి కృష్ణ, సీతారామ్ నాయుడు, అధికారులు, వైద్యులు, రాస్, పాస్ ఎన్జీఓల ప్రతినిధులు పాల్గొన్నారు.

నేషనల్ హైవే భూ సర్వే