
నేను సైతం ద్వారా మహిళకు ఇంటి నిర్మాణం
చిల్లకూరు:ఓ చానల్‌లో నిర్వహించిన నేను సైతం కార్యక్రమం ద్వారా ఓ మహిళకు ఇంటిని నిర్మించి ఇచ్చారు. గూడూరు రెండో పట్టణంలోని తిలక్‌నగర్ ప్రాంతానికి చెందిన ఉష అనే పేద మహిళ రైలు ప్రమాదంలో కాలు పోగొట్టుకోవడంతో పాటుగా భర్తను కోల్పోయింది. దీంతో ఆమె తన ఇద్దరు పిల్లలతో జీవనం కష్టంగా మారడంతో ఓ చానల్‌లో ప్రముఖ సినీ నటి మంచి లక్ష్మి చేపట్టిన నేను సైతం అనే కార్యక్రమంలో పాల్గొని, తన బాధను తెలియజేసింది. దీంతో ఆమెకు అండగా ఉండేలా ఇంటిని నిర్మించి ఇస్తామని అప్పట్లో ప్రకటించారు. ఈ క్రమంలో మంగళవారం ఉష ఇంటికి సినీ నటి మంచు లక్ష్మి చేరుకుని, ఉష కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి అండగా ఉంటామని తెలిపారు. అనంతరం ఉష మాట్లాడుతూ తన బాధలను గుర్తించి మంచు లక్ష్మి, మనోజ్ తనకు అండగా నిలిచి ఇంటి నిర్మాణం పూర్తి చేసి ఇచ్చారన్నారు. అలాగే తన కుమారుని చదువుకు సహాయం చేస్తామని చెప్పడం సంతోషంగా ఉందన్నారు. అంతకు ముందుగా మంచు లక్ష్మి పట్టణంలోని సనత్‌నగర్‌లో ఉన్న బంధువులైన రవీంద్రరెడ్డి నివాసంలో కొంత సేపు గడిపి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు.