సిందూరంతో ‘మురళీ’ చిత్రం
తిరుపతి అర్బన్ : తిరుపతి కేంద్రంగా పనిచేస్తున్న మైక్రో ఆర్టిస్ట్ చిరంజీవి తాజాగా ఇటీవల యుద్ధంలో మృతి చెందిన వీరజవాన్ మురళీ నాయక్ చిత్రపటాన్ని శ్రీపద్మావతి అమ్మవారి సిందూరంతో తయారు చేసి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్‌కు సమర్పించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను కలిశారు. దేశభక్తి సృజనాత్మకతను చాటుకునేలా వీరజవాన్ చిత్రపటాన్ని తయారు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆర్టిస్ట్ చిరంజీవిని అభినందించారు.
కుటుంబ కలహాలతో
వ్యక్తి ఆత్మహత్య
గూడూరురూరల్ : గూడూరు పట్టణ శివారు ప్రాంతంలోని టిడ్కో ఇళ్లలో నివాసం ఉండే ఓ వ్యక్తి కుటుంబం కలహాల కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు టిడ్కో ఇళ్లలో నివాసం ఉండే కావలి సుబ్బారావు(43) నెల్లూరులోని విద్యుత్ శాఖ కార్యాలయంలో సబార్డినేటర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడి కుటుంబంలో ఏర్పడిన కలహాల కారణంగా మనస్తాపం చెందిన ఆయన ఇంటిలో ఎవ్వరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు చూసేసరికి అప్పటికే మృతి చెందిన్నట్లు గుర్తించారు. దీంతో వారు రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.


