
గ్యాస్ పైపులైన్ల పేరుతో అడ్డగోలు తవ్వకాలు
● రోడ్డుకు అడ్డంగా మట్టి కుప్పలు ● వాహన రాకపోకలకు ఇబ్బందులు ● పంచాయతీ నీటి సరఫరా పైపులైన్లు ధ్వంసం ● పట్టించుకోని అధికారులు
వరదయ్యపాళెం మండలం దుమ్ము కొట్టుకుపోతోంది. గ్యాస్ పైప్‌లైన్ కోసం ఆర్‌అండ్‌బీ రోడ్డు పక్కనే ఇష్టారాజ్యంగా తవ్వేసి వదిలేయడంతో స్థానికులు అవస్థలు పడాల్సి వస్తోంది. పలు పంచాయతీలకు సంబంధించిన తాగునీటి పైపులు సైతం ధ్వంసం చేయడం.. ఆపై వాటిని ఇంతవరకు మరమ్మతులకు గురిచేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇంతజరుగుతున్నా ఏ ఒక్క అధికారీ అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.
ఊరు వదిలి వెళ్లాల్సిందే
గత రెండు వారాలుగా చిన్న పాండూరులో ఎ ర్రమట్టి దుమ్ము ధాటికి నిలవలేకపోతున్నాం. రోడ్డుకు ఆనుకుని టైలరింగ్ దుకాణం ద్వారా ఉపాధి పొందే నేను దుమ్ము కారణంగా పనులు చేసుకోలేని పరిస్థితి నెలకొంది. నిత్యం వాహనాల తాకిడికి, ఎండ వేడిమికి ఒక్కసారిగా పొగమంచు వలె దుమ్ము చుట్టుకుపోతోంది. కనీసం ట్యాంకర్‌తో నీళ్లయినా చల్లితే దుమ్మును నియంత్రించవచ్చు.
– వెంకటేష్, టైలర్, చిన్న పాండూరు
పది రోజులుగా నీళ్లు లేవు
చిన్న పాండూరు అరుంధతివాడ నుంచి కోవూరుపాడు గ్రామానికి పంచాయతీ నీరు సరఫరా అవుతోంది. పది రోజుల క్రితం గ్యాస్ పైపులైను కోసం తీసిన గోతి కారణంగా నీటి పైపులైన్ ధ్వంసమైంది. ఇప్పటి వరకు దాన్ని మరమ్మతులు చేయలేదు. తాగునీటి కోసం గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి.
– రాంబాబు, స్థానికుడు, కోవూరుపాడు
వరదయ్యపాళెం: సత్యవేడు–కడూరు కూడలి ప్రధాన రోడ్డు మార్గంలో చిన్నపాండూరు మీదుగా శ్రీసిటీ పారిశ్రామికవాడకు ఆర్‌అండ్‌బీకి చెందిన ప్రధాన రోడ్డు మార్గానికి ఇరువైపులా గ్యాస్ పైపులైన్, నీటి పైపులైన్ల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం గ్యాస్ పైపులైన్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. యానాదివెట్టు నుంచి చిన్న పాండూరు వరకు గత రెండు వారాలుగా పనులు చేపడుతున్నారు. అయితే రోడ్డుకు ఆనుకుని అడ్డదిడ్డంగా పనులు చేపడుతుండడంతో స్థానికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
దుమ్ము కొట్టుకుపోతున్న చిన్న పాండూరు
ప్రధాన రోడ్డుకు ఆనుకుని చిన్న పాండూరు, యానాదివెట్టు గ్రామాలు ఉన్నాయి. పైపులైన్ ఏర్పాటు కారణంగా రోడ్డుకు ఇరువైపులా గోతులు తీసి మట్టిని రోడ్డుపై నిల్వ ఉంచారు. ఆ మార్గం గుండా వచ్చే వాహన తాకిడికి ఎర్రటి దుమ్ము కమ్మేస్తోంది. రోడ్డుకు ఆనుకుని ఉన్న కుటుంబాల వారు, దుకాణదారులు దుమ్ముకొట్టుకుపోతున్నారు. వ్యాపారాలు లేక దుకాణలను సైతం మూసుకుని వెళ్తున్నారు. రోడ్డు పక్కనే ఉన్న పలు కుటుంబాల వారు ఈ పనులు పూర్తయ్యేంత వరకు ఇక్కడ ఉండలేమని ఆందోళన చెందుతున్నారు. కనీసం పనులు చేపడుతున్న కాంట్రాక్టర్ దుమ్ము లేవకుండా నీటిని కూడా చల్లడం లేదు.
పట్టించుకోని యంత్రాంగం
ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా గ్యాస్ పైపులైన్ నిర్వాహకులు వ్యవహరిస్తున్నప్పటికీ నియంత్రించాల్సిన ప్రభుత్వ యంత్రాంగం తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. ప్రధానంగా రోడ్లను సైతం తవ్వేస్తున్నా ఆర్ అండ్ బీ అధికారులు కూడా అటువైపు కన్నెత్తి చూడడం లేదు. పంచాయతీ ప్రజలకు సరఫరా అయ్యే తాగునీటి పైపులైన్లను ధ్వంసం చేస్తున్నా మండల పరిషత్ అధికారులు పత్తాలేకుండా పోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. రోడ్డుకడ్డంగా మట్టికుప్పలను నిల్వ చేసి వాహనదారులు సైతం ప్రమాదాలకు గురవుతున్నా పోలీస్ యంత్రాంగం సైతం తమకెందుకులే అన్నట్టు మిన్నకుండిపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ధ్వంసమైన తాగునీటి పైపులైన్లు
గ్యాస్ పైపులైన్ పనుల కారణంగా యానాదివెట్టు, కోవూరుపాడు, చిన్న పాండూరు, రాచర్ల అరుంధతివాడ గ్రామాలకు నీటి సరఫరా జరిగే పైపులైన్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. హిటాచీ యంత్రాలతో తీసిన గోతుల కారణంగా పైపులైన్లు దెబ్బతిన్నా యి. రెండు వారాలుగా గ్రామాలకు నీటి సరఫరా ఆగిపోయింది. పంచాయతీ పరిధిలో పైపులైన్ కోసం తవ్వకాలు జరిగే సమయంలో ప్రాథమిక సమాచారం కూడా స్థానిక సర్పంచులకు ఇవ్వడంలేదు. ముందస్తు సమాచారమిస్తే పంచాయతీ ద్వారా చర్యలు తీసుకునే అవకాశం ఉందని సర్పంచులు చెబుతున్నారు.
రాకపోకలకు అవస్థలు
పైపులైన్ కోసం గోతులు తీసి మట్టికుప్పలను పలుచోట్ల రోడ్డుకడ్డంగా నిల్వ ఉంచడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ప్రధానంగా చిన్న పాండూరు, యానాదివెట్టు మధ్యలో ఇటీవల తరచూ ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. కనీసం పనులు చేపడుతున్న కాంట్రాక్టర్ వారి సిబ్బంది ద్వారా భద్రతా పరమైన చర్యలు గానీ, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు గానీ చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది.

గ్యాస్ పైపులైన్ల పేరుతో అడ్డగోలు తవ్వకాలు

గ్యాస్ పైపులైన్ల పేరుతో అడ్డగోలు తవ్వకాలు

గ్యాస్ పైపులైన్ల పేరుతో అడ్డగోలు తవ్వకాలు

గ్యాస్ పైపులైన్ల పేరుతో అడ్డగోలు తవ్వకాలు

గ్యాస్ పైపులైన్ల పేరుతో అడ్డగోలు తవ్వకాలు

గ్యాస్ పైపులైన్ల పేరుతో అడ్డగోలు తవ్వకాలు