
ఎస్వీయూలో వసతులు లేక వెతలు!
తిరుపతి సిటీ : ఎస్వీయూలో మౌలిక వసతులు లేక అవస్థలు పడుతున్నామని వర్సిటీ ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. దీనిపపై వర్సిటీ అధికారులకు పలు మార్లు విన్నవించినా ఫలితం లేదని వాపోతున్నారు. ఈ క్రమంలో శనివారం మరోసారి వర్సిటీ ఇంజినీర్‌ను మౌలిక వసతుల కల్పనపై నిలదీయనున్నట్లు సమాచారం. పరిపాలన భవనంలో సదుపాయాలపై వీసీ, రిజిస్ట్రార్‌తో చర్చించినా అడుగు ముందుకు పడటం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాసిరకం ఫర్నిచర్‌తో ఇక్కట్లు
పరిపాలన భవనంలోని ప్రధాన సెక్షన్లలో బెంచీలు, కుర్చీలు,, బీరువాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, ఎగ్జామినేషన్ సెక్షన్‌లో పరిస్థితి దారుణంగా తయారైందని ఉద్యోగులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం ఎగ్జామినేషన్ విభాగంలో నూతన ఫర్నిచర్‌ను అమర్చేందుకు తీసుకువచ్చిన సామగ్రి పూర్తిగా నాసిరకంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ కంపెనీ పేరుతో వర్సిటీకి తెచ్చిన ఫర్నిచర్‌పై రెండు ఫైళ్లు పెట్టగానే వంగిపోతున్నాయని ఆరోపిస్తున్నారు.
తాగునీరు కూడా లేదు
ఎస్వీయూ పరిపాలన భవనంలో తాగునీరు కూడా అందుబాటులో లేదని ఉద్యోగులు వాపోతున్నారు. ఆర్‌ఓ ప్లాంట్ వద్ద అపరిశుభ్రంగా ఉంటోందని వెల్లడిస్తున్నారు. దీంతో ఇంటి నుంచి బాటిళ్లలో నీరు తెచ్చుకోవాల్సి వస్తోందని తెలియజేస్తున్నారు. వర్సిటీలో టాయిలెట్స్ పరిస్థితి మరీ దారుణంగా ఉందని వివరిస్తున్నారు.
నిలదీయనున్న ఉద్యోగులు
పరిపాలనా భవనంలో నాసిరకం ఫర్నిచర్, టాయిలెట్స్, తాగునీటి సౌకర్యంపై వర్సిటీ ఇంజినీర్‌ను నిలదీయాలని ఉద్యోగులు నిర్ణయించినట్లు తెలిసింది. సమస్యల పరిష్కారంపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని కోరనున్నట్లు సమాచారం.