తిరుమల: పర్యాటకాభివృద్ధిలో భాగంగా తిరుమలలోని పాపవినాశనం డ్యామ్‌లో తిరుపతి అటవీశాఖ అధికారులు మంగళవారం బోటింగ్ ట్రయల్ రన్ నిర్వహించారు. తిరుమలలోని కుమారధార, పసుపుధార నీరు పాపవినాశనం డ్యామ్‌కు చేరుతుంది. ఈ ప్రాంతంలోనే టీటీడీకి చెందిన పాపవినాశనం తీర్థం, గంగాదేవి ఆలయం ఉంది. భక్తులు పెద్ద ఎత్తున ఈ ఆధ్యాత్మిక క్షేత్రానికి వస్తుంటారు.
అయితే, అటవీశాఖ పరిధిలో ఉన్న ఈ ప్రాంతం ఇప్పటి వరకూ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. అకస్మాత్తుగా అధికారులు బోటింగ్ ట్రయల్ రన్ నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆధ్యాత్మిక క్షేత్రాన్ని పర్యాటక కేంద్రంగా మారుస్తున్నారంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తనిఖీల కోసమే బోట్లు
వెంకటేశ్వర నేషనల్ పార్క్, శేషాచలం బయోస్పేర్ రిజర్వ్‌లోని పాపవినాశనం డ్యామ్ చుట్టూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్టు సమాచారం వచ్చింది. తనిఖీల కోసం బోట్‌లు వినియోగించాం. అనంతరం వాటిని వెనుక్కు తీసుకొచ్చాం.
– పి.వివేక్, జిల్లా అటవీశాఖ అధికారి