సాక్షి, టాస్క్‌ఫోర్స్ : కూటమి ప్రభుత్వం ఏర్పడిన 9 నెలల్లోనే టీడీపీ, జనసేన, బీజేపీ నేతల్లో విభేదాలు మొదలయ్యాయి. ఆదివారం చంద్రగిరిలో జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో నేతల నడము పొరపొచ్చాలు బహిర్గతమయ్యాయి. చంద్రగిరి జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి దేవర మనోహర్ ఆధ్వర్యంలో కార్యాలయం ప్రారంభించేందుకు సన్నాహాలు చేశారు. ఈ మేరకు కూటమి ప్రజాప్రతినిధులు, నేతలను ఆహ్వానించారు. ఈ మేరకు పట్టణంలో కూటమి నేతల ఫొటోలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
8 గంటలకు అని చెప్పినా..!
పార్టీ కార్యాలయాన్ని ఉదయం 8 గంటలకు ప్రారంభించనున్నట్లు జనసేన నేతలు తొలుత ప్రకటించారు. అయితే మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా టీడీపీ, బీజేపీ నాయకులు కనిపించకపోవడంతో జనసేన నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక చేసేది లేక తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, జనసేన జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్‌తో కలిసి కొత్తపేటలోని పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి, కార్యాలయం ప్రారంభించారు.
ఇంటికెళ్లి పిలిచినా..!
జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి రావాలంటూ టీడీపీ చంద్రగిరి నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఇంటికెళ్లి జనసేన నేతలు ఆహ్వానించినట్లు సమాచారం. అయినప్పటికీ ఆయన ముఖం చాటేయడంపై జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు.