
‘స్కావెంజర్స్’ జోలికి వస్తే యుద్ధమే!
● వైఎస్సార్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి
తిరుపతి మంగళం : తిరుపతి నగర ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం అందించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు నివసిస్తున్న స్కావెంజర్స్ కాలనీ జోలికి వస్తే సహించే ప్రసక్తే లేదని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి హెచ్చరించారు. ఆదివారం తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల ఆరోగ్యం కోసం తమ ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్న పారిశుద్ధ్య కార్మికులను ఇబ్బంది పెట్టాలని చూస్తే ఉద్యమం కాదని, యుద్ధమే చేస్తామని స్పష్టం చేశారు. నగర నడిబొడ్డులోని 4.61ఎకరాల విస్తీర్ణంలో స్కావెంజర్స్ కోసం కాలనీ ఏర్పాటు చేశారన్నారు. సుమారు 70 ఏళ్లుగా ఈ కాలనీలో పారిశుద్ధ్య కార్మికులు నివసిస్తున్నారని వెల్లడించారు. వీరికి అక్కడే శాశ్వతంగా ఇల్లు నిర్మించాలని గతంలో అనేక ప్రతిపాదనలు చేసినట్లు వివరించారు. అయితే 2014–19 మధ్య నాటి టీడీపీ ప్రభుత్వంలో అప్పటి మంత్రి నారాయణ కుట్రపూరితంగా స్కావెంజర్స్‌కాలనీని ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పేందుకు చర్యలు చేపట్టారని ఆరోపించారు. దీనిపై అప్పట్లోనే భూమన కరుణాకరరెడ్డితో పాటు వామపక్ష నాయకులు ఉద్యమాలు చేపట్టారని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం 4.61ఎకరాల స్కావెంజర్స్‌కాలనీ విలువ సుమారు రూ. 120కోట్లకు చేరిందని తెలిపారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం దురాలోచనతో పారిశుద్ధ్య కార్మికులను తరిమేసి, స్కావెంజర్స్‌కాలనీని ప్రైవేట్ కంపెనీలకు అప్పగించేందుకు కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. అందులో భాగంగానే ఆ ప్రాంతంలో సర్వేలు చేపడుతోందన్నారు. తిరుపతిలో పారిశుద్ధ్యం మరింత మెరుగుపరిచేందుకు టీటీడీ సహకారంతో 1,700 మంది కార్మికులను ఆదనంగా తీసుకోవాలని నిర్ణయించామని, అప్పట్లో బీజేపీనేత భాను ప్రకాష్‌రెడ్డి కోర్టుకెళ్లి అడ్డుకున్నారని వెల్లడించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కార్మికులకు అన్యాయం జరుగుతుంటే భానుప్రకాష్‌రెడ్డి ఎందుకు కోర్టుకు వెళ్లలేదని ప్రశ్నించారు. స్కావెంజర్స్ కాలనీ నుంచి కార్మికులను తరిమేయాలని చూస్తే పోరాటం తప్పదని హెచ్చరించారు.