
దృఢ సంకల్పమే విజయానికి ఆయుధం
తిరుపతి సిటీ : దృఢ సంకల్పం ఉంటే జీవితంలో లక్ష్యాన్ని చేరుకోవచ్చని, దృఢ సంకల్పమే ఆయుధంగా ముందుకు సాగాలని ఎస్వీయూ పూర్వ విద్యార్థి, తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్‌రెడ్డి తెలిపారు. ఎస్వీయూ ఇంజినీరింగ్ కళాశాల ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో ఆదివారం సిగ్మండ్–2025 ఫెస్ట్‌ను ఘనంగా నిర్వహించారు. ఇందులో ఆయన వర్చువల్ విధానంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. తాను ఎస్వీయూలో ఈసీఈ విభాగంలో 2012లో ఇంజినీరింగ్ పూర్తి చేశానని తెలిపారు. సివిల్స్ లక్ష్యంగా శ్రమించానని, పలు ప్రయత్నాల్లో విఫలమైనా ఆత్మ విశ్వాసాన్ని వదలలేదన్నారు. తర్వాత తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నానని తెలిపారు. ప్రతి ఒక్కరికీ విద్యార్థి దశ కీలకమన్నారు. ఎస్వీయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో నిపుణులైన అధ్యాపకులకు కొదవలేదన్నారు. వారి సూచనల మేరకు క్రమశిక్షణతో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
ఐఏఎస్ అధికారి మాటలతో
స్ఫూర్తి పొందిన విద్యార్థులు
తమ కళాశాలలో చదివి ఐఏఎస్‌గా ఎంపికై న రాహుల్ కుమార్‌రెడ్డి మాటలతో ఈసీఈ విభాగం విద్యార్థులు స్ఫూర్తి పొందారు. ఆయన విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సావధానంగా సమాధానం ఇచ్చారు. సందేహాలను నివృత్తి చేశారు. విఫలం చెందామని నిరుత్సాహ పడకుండా ముందుకు సాగితే లక్ష్యం కాళ్ల వద్దకు చేరుతుందన్నారు. సివిల్స్ కష్టసాధ్యమైన పరీక్ష అంటూ సమాజంలో ఎంతో మంది వెనుకడుగు వేస్తారని, అది సత్యదూరమన్నారు.
ఎస్వీయూ విద్యార్థి ఐఏఎస్ సాధించడం గర్వకారణం
వీసీ అప్పారావు మాట్లాడుతూ ఎస్వీయూ ఈసీఈ విభాగం పూర్వ విద్యార్థి రాహుల్ కుమార్‌రెడ్డి ఐఏఎస్ సాధించడం గర్వకారణమన్నారు. విద్యార్థులు ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత లక్ష్యాలతో శ్రమించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ సుబ్బారావు, ఈసీఈ విభా గం హెడ్ స్వర్ణలత, కన్వీనర్ ప్రొఫెసర్ వరదరాజన్, స్టూడెంట్ కోఆర్డినేటర్స్ రామ్ హర్షన్, వర్షిత, పలు కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
ఎస్వీయూ పూర్వ విద్యార్థి,
ఈస్ట్ గోదావరి జేసీ రాహుల్ కుమార్‌రెడ్డి
ఎస్వీయూలో
ఘనంగా సిగ్మాండ్–2025 ఫెస్ట్

దృఢ సంకల్పమే విజయానికి ఆయుధం