వడమాలపేట(విజయపురం): విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికే సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని ఏపీ ఎస్‌పీడీసీఎల్ తిరుపతి జిల్లా ఎస్‌ఈ సురేంద్రనాయుడు అన్నారు. వడమాలపేట మండలం పాదిరేడు రచ్చబండ ఆవరణలో గురువారం విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో వినియోగదారుల సమస్యలు తెలుసుకునేందుకు ప్రాంతాల వారీగా సదస్సులు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 24 నుంచి 31వ తేదీ వరకు సదస్సులు జరుగుతాయన్నారు. తిరుపతి జిల్లాలో మొత్తం 241 సబ్‌స్టేషన్లు ఉన్నాయని, ఆయా ప్రాంతాల్లో ఉన్న డీఈ, ఏఈ తన పరిధిలోని సబ్‌స్టేషన్ ఆవరణలో సదస్సు ఏర్పాటు చేసి, రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. అనంతరం పలు ప్రాంతాల నుంచి వచ్చిన విద్యుత్ వినియోగదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పుత్తూరు ఈఈ దేవఆశ్వీరాదం, డీఈఈ శంకయ్య, ఏఈ భాస్కర్‌రాజు, ధనంజేయులునాయుడు తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మీనరసింహుడి సేవలో ఎస్పీ శైలజ
రాపూరు: మండలంలోని పెంచలకోన పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మిదేవి, ఆంజనేయస్వామివారిని ప్రముఖ గాయని ఎస్పీ శైలజ గురువారం దర్శించుకున్నారు. ఆమెకు దేవస్థానం సిబ్బంది సాదర స్వాగతం పలికి, మూడు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు. వేదపండితులు ఆశ్వీరవచనాలు పలికి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
విద్యుత్ సమస్యల పరిష్కారానికే సదస్సులు