
మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం
వరదయ్యపాళెం : బాణసంచా గోదాములో అగ్ని ప్రమాద ఘటనపై రాజకీయాలు చేయడం దారుణమని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మండిపడ్డారు. శుక్రవారం వరదయ్యపాళెంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రమాదం సంభవించిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారని, బాధిత కుటుంబాలకు 24 గంటలలోపే రూ.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించామన్నారు. విషాద సమయంలో బాధితులకు అండగా నిలవాలే కానీ, రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూడడం హేయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ప్రమాద మృతులకు దహన సంస్కారాలు జరగకుముందే సంబంధిత కుటుంబాలకు ఆర్ధిక సాయం అందించి భరోసా కల్పించామన్నారు. చెక్కుల పంపిణీకి కలెక్టర్‌తో కలిసి వచ్చిన తనను అడ్డుకునేందుకు కొందరు యత్నించడం సరికాదని తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరి ప్రమేయం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో కూడా మరణించి వారి కుటుంబాలకు అండగా నిలబడ్డామని వెల్లడించారు. మాటలు చెప్పి, తప్పించుకుపోయేవారిని ప్రజలు గుర్తించాలని సూచించారు. మండల పరిషత్ ప్రత్యేక ఆహ్వానితుడు దామోదర్‌రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ దయాకర్‌రెడ్డి, జేసీఎస్ కన్వీనర్ చిన్నా, సింగిల్‌విండో చైర్మన్ హరిబాబురెడ్డి, దేవాంగ కార్పొరేషన్ డైరెక్టర్ తిలక్‌బాబు, వినోద్‌యాదవ్ పాల్గొన్నారు.