మహానేత మెమోరియల్‌కు మహానగరంలో చోటేదీ?

YS Sharmila Tribute To YS Rajashekar Reddy Birth Anniversary - Sakshi

ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల

సాక్షి, హైదరాబాద్‌: దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డికి నివాళి అర్పించుకోడానికి ప్రభుత్వం హైదరాబాద్‌లో ఒక మెమోరియల్‌ను కూడా ఏర్పాటు చేయలేదని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. శుక్రవారం ఇక్కడి లోటస్‌పాండ్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వైఎస్సార్‌ 73వ జయంతి, వైఎస్సార్‌టీపీ ఆవిర్భావ దినోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ జెండా ఎగుర వేసి కేక్‌ కట్‌ చేశారు.

అనంతరం షర్మిల విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్సార్‌ స్మారకార్థం హైదరాబాద్‌లో స్థలం కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ‘రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్సార్‌ ఘాట్‌ కోసం ప్రసాద్‌ ఐమాక్స్‌ పక్కన 20 ఎకరాల భూమి కేటాయించామన్నారు. ఏడాదిలోగా పను లు పూర్తి చేస్తామని చెప్పారు. కానీ, కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక ఆ భూమిని వెనక్కి తీసుకుని అన్యాయం చేశారు’అని అన్నారు. 2004లో వైఎస్సారే కేసీఆర్‌ను కేంద్రమంత్రిగా, హరీశ్‌రావును రాష్ట్రమంత్రిగా చేశా రని గుర్తుచేశారు. వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారని, ప్రతి పథకంలోనూ తెలంగాణకు పెద్దపీట వేశారని పేర్కొన్నారు. 
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో

అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం..
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని, అందులో ఎలాంటి అనుమానం లేదని షర్మిల స్పష్టం చేశారు. రైతు సమస్యలపై రైతు ఆవేదన యాత్ర, రైతుగోస దీక్షలు చేపట్టామని చెప్పారు. పోడు పట్టాల కోసం, దళితులు బీసీల కోసం తమ పార్టీ పోరాడిందని, ఫీల్డ్‌ అసిస్టెంట్ల తరఫున నిలబడ్డ ఏకైక పార్టీ వైఎస్సార్‌టీపీ అని అన్నారు. నిరుద్యోగుల కోసం 31 నిరాహార దీక్షలు చేశామని, ఇంకా చేస్తున్నామని పేర్కొన్నారు. తమ పోరాటం వల్లే కేసీఆర్‌కు సోయి వచ్చి 80 వేల ఉద్యోగాలు భర్తీ చేశారని పేర్కొన్నారు. వైఎస్సార్‌ పేరు కోసం పనిచేస్తామని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి చెబుతున్న దొంగమాటలు నమ్మే వారు ఇక్కడ లేరన్నారు. సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధులు తూడి దేవేందర్, పిట్టా రాంరెడ్డి, వాడుక రాజగోపాల్‌ పాల్గొన్నారు. 

వైఎస్సార్‌కు నివాళి
పంజగుట్ట: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి 73వ జయంతి పురస్కరించుకుని ఆయన కుమార్తె, వైఎస్సార్‌టీపీ రాష్ట్ర అధ్యక్షు రాలు వైఎస్‌ షర్మిల పంజగుట్టలోని వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top