యూట్యూబర్‌ బయ్యా సన్నీ అరెస్టు కలకలం | YouTuber Bayya Sunny Arrested By The NIA At Chennai Airport | Sakshi
Sakshi News home page

యూట్యూబర్‌ బయ్యా సన్నీ అరెస్టు కలకలం

May 30 2025 1:31 AM | Updated on May 30 2025 12:57 PM

YouTuber Bayya Sunny arrest

స్వస్థలం సూర్యాపేట జిల్లా నూతనకల్‌లో చర్చ 

ఇటీవలే పాకిస్తాన్‌ నుంచి నూతనకల్‌ వచ్చిన సన్నీ 

సూర్యాపేటటౌన్, నూతనకల్‌: యూట్యూబ్‌ వ్లాగర్, బైక్‌ రైడర్‌ బయ్యా సన్నీయాదవ్‌ను నేషనల్‌ ఇన్వెస్టిగేటింగ్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసినట్లు జరుగుతున్న ప్రచారంతో ఆయన స్వస్థలం సూర్యాపేట జిల్లా నూతనకల్‌లో కలకలం సృష్టించింది. సన్నీయాదవ్‌ ఇటీవల పాకిస్తాన్‌లో పర్యటించి.. తన యూట్యూబ్‌ చానల్‌లో ఆ పర్యటనకు సంబంధించిన బైక్‌ రైడింగ్‌ వీడియోలను పోస్ట్‌ చేశాడు. ఆ వీడియోలపై ఇటీవల ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో చెన్నైలో సన్నీయాదవ్‌ను ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకొని ఢిల్లీకి తరలించినట్లు ప్రచారం జరుగుతోంది. 

పాకిస్తాన్‌ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ కొంతమంది భారత సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను తన వేగులుగా మార్చుకోవటంతో వారిని భారత దర్యాప్తు సంస్థలు ఇటీవల అరెస్టు చేశాయి. ఈ కోణంలోనే సన్నీయాదవ్‌ను కూడా ప్రశ్నిస్తున్నట్లు చెబుతున్నారు. బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేసినందుకు ఆయనపై మార్చి 22న నూతనకల్‌లో కేసు నమోదైంది. 

ఈ కేసులో అతడికి బెయిల్‌ లభించింది. కొద్దిరోజుల క్రితం నూతనకల్‌ వచ్చి.. ఇటీవల తన స్నేహితుడిని కలిసేందుకు చెన్నై వెళ్లాడు. అక్కడే ఎన్‌ఐఏ అతడిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయం తమకు తెలియదని సన్నీ కుటుంబసభ్యులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement