
సనత్‌నగర్: ‘నువ్వు నాతో ఉండకపోతే, నీ ఫొటోలను ప్రతిచోటా వైరల్ చేస్తా..నీ జీవితాన్ని నాశనం చేస్తా.. నువ్వు ఎవరికీ నీ ముఖాన్ని చూపించలేవు..’ అంటూ మార్ఫింగ్ చేసిన అశ్లీల ఫోటోలు, వీడియోలతో ఓ యువతిని బెదిరించిన వ్యక్తిపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బేగంపేట ఇండియన్ ఎయిర్‌లైన్స్ కాలనీకి చెందిన యువతి (18) కామన్ లా అడ్మిషన్ టెస్ట్‌కి ప్రేపర్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్ హార్దోల్‌కు చెందిన అర్షద్‌ఖాన్ ఏఐ పరిజ్ఞానంతో మార్ఫింగ్ చేసిన ఆమె అశ్లీల ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ గత కొంతకాలంగా బెదిరింపులకు దిగుతున్నాడు. ఈ క్రమంలో ఆమెతో పాటు ఆమె సోదరుడికి కూడా ఆ ఫొటోలు పంపించి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడు. ఆమెకు ఫోన్ చేసి నాతో రావాలని, నేను చెప్పినట్లు వినాలని బెదిరించాడు. దీంతో అర్షద్ వేధింపులు తట్టుకోలేక బాధితురాలు బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.