
మణికొండ: ఓ సెల్‌ఫోన్ చోరీ వ్యవహారం యువకుడి హత్యకు దారి తీసింది. అర్ధరాత్రి వరకు ముగ్గురు స్నేహితులు కలిసి అతిగా మద్యం తాగి మత్తులో గొడవ పడ్డారు. చోరీ చేసిన ఫోన్‌ను తిరిగి ఇచ్చేయాలని చెప్పిన యువకున్ని మరో ఇద్దరు యువకులు దారుణంగా కత్తితో దాడి చేసి హత్య చేసిన సంఘటన నార్సింగి – కోకాపేట రోడ్డులోని డబుల్ బెడ్ రూం గృహాల సముదాయం పక్కన సోమవారం అర్ధరాత్రి జరిగింది. నార్సింగి ఇన్‌స్పెక్టర్ హరికృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
షాద్‌నగర్‌కు చెందిన కాశారం యాదగిరి(24), కిషన్‌బాగ్‌కు చెందిన అఫ్రోజ్, నవాజ్‌ల కుటుంబాలకు 11 నెలల క్రితం నార్సింగిలో డబుల్ బెడ్‌రూంలు మంజూరు కావటంతో ఇక్కడే పక్కపక్కనే నివసిస్తున్నారు. ముగ్గురు స్నేహితులు కలిసి మూడు రోజుల క్రితం నార్సింగిలో మరో యువకున్ని కొట్టి సెల్‌ఫోన్‌ను లాక్కున్నారు. దాన్ని యాదగిరి వ్యతిరేకించాడు. అది తిరిగి ఇచ్చేయాలని పట్టుపట్టాడు. అప్పటికే దాన్ని అమ్మేసిన హంతులకు విషయం యాదగిరి బయటపెడతాడని భావించి సోమవారం రాత్రి వారి గృహాలకు సమీపంలోనే నిర్మానుష్య ప్రాంతంలో మద్యం తాగుదామని అతన్ని పిలిచారు. వింటే సరే లేదంటే హత్య చేయాలని పథకం వేసుకున్నారు.
మద్యం తాగించి హత్య..
తమ పథకంలో బాగంగా మృతుడు యాదగిరికి ఎక్కువగా మద్యం తాగించి మత్తు ఎక్కేలా చేశారు. తర్వాత వారి వద్ద సిద్ధంగా ఉన్న కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు. నొప్పి తాళలేక గట్టిగా అరవడంతో డబుల్ బెడ్ రూంలలో నివసిస్తున్న వారు సంఘటనా స్థలానికి వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 108ను రప్పించి ఆసుపత్రికి తరలించే ప్రయత్నంలోనే అతను ప్రాణాలు కోల్పోయాడు. దాంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిందితులలో ఒకడైన అఫ్రోజ్‌పై ఆర్‌జీఐ, బహదూర్ పురా పోలీస్‌స్టేషన్‌లలో పాత కేసులు ఉన్నాయని సీఐ తెలిపారు. నిందితులనిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్టు తెలిసింది.