karimnagar women delivery twin babies died over hospital doctors negligence - Sakshi
Sakshi News home page

దారుణం: కన్నతల్లిని చూడకుండానే కవలల మృతి

May 23 2021 8:46 AM | Updated on May 23 2021 12:05 PM

Women Delivery Before Twin Babies Died In Karimnagar Over Hospital Doctors Negligence - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

కరీంనగర్‌టౌన్‌: నిండు గర్భిణీ.. కాన్పు కోసం వస్తే ‘మీది ఈ జిల్లా కాదు.. ఎవరి జిల్లాలో వారే ప్రసూతి చేయించుకోవాలి..’ అని వెనక్కి పంపించారు కరీంనగర్‌లోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం వైద్యులు. దీంతో బాధితురాలు సొంత జిల్లాకు వెళ్లగా.. అక్కడా ఆమెకు నిరాశే ఎదురైంది. ఇలా రెండుమూడు చోట్లకు తిరగడంతో ప్రసవానికి ముందే ఓ బిడ్డ కన్నుమూయగా.. చికిత్స పొందుతూ మరో బిడ్డ చనిపోయిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

వివరాలిలా ఉన్నాయి.. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూరుబేగంపేటకు చెందిన బెజ్జంకి కమల రెండో కాన్పు కోసం ఈనెల 18న కరీంనగర్‌లోని మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది. అయితే అక్కడి వైద్యులు ఎవరి జిల్లాలో వారే వైద్యం చేయించుకోవాలని వెనక్కి పంపించారు. దీంతో బంధువులు ఆమెను సిద్దిపేట ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు.. ఇక్కడ కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయని, గజ్వేల్‌ ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. అయితే అక్కడి వైద్యులు సైతం ఆమెను చేర్చుకోకుండానే హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ఆస్పత్రికి రెఫర్‌ చేశారు. దీంతో అయోమయానికి గురైన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌ వెళ్లలేక తిరిగి కరీంనగర్‌కే చేరారు.

ఇక్కడి వైద్యులను బతిమిలాడుకున్నారు. దీంతో వైద్యులు ఈనెల 20న ఆపరేషన్‌ చేసి కవలలకు పురుడు పోశారు. అయితే అప్పటికే ఆడ శిశువు చనిపోయింది. మగ శిశువు బరువు తక్కువగా ఉండటంతో ఐసీయూలో పెట్టారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. చికిత్స పొందుతూ ఆ శిశువు కూడా శనివారం మృతిచెందింది. దీనికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని, ముందే ఆపరేషన్‌ చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని పేర్కొంటూ బంధువులు మాతాశిశు ఆరోగ్యం కేంద్రం ఎదుట ఆందోళనకు దిగారు. కరోనా కారణం చెబుతూ వైద్యులు గర్భిణుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్నారని, ఆపదలో ఉన్న వారికి వైద్యం చేయకుండా సొంత జిల్లాలకు వెళ్లగొడుతున్నారని ఆరోపించారు. 

కరోనాతో తండ్రి, కొడుకు మృతి
మానకొండూర్‌: కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ మండలం చెంజర్ల గ్రామంలో కరోనాతో తండ్రీకొడుకులు గంటల వ్యవధిలో మృతిచెందారు. గ్రామానికి చెందిన మూల తిరుమల్‌ (52), అతడి కొడుకు మూల గిరి (30) గీత వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరిద్దరూ నాలుగు రోజుల క్రితం కరోనా బారినపడ్డారు. చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు. కాగా, తిరుమల్‌ పరిస్థితి విషమించి శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు. అతడికి రాత్రి అంత్యక్రియలు పూర్తిచేశారు. అదేరోజు రాత్రి 11 గంటలకు గిరి కూడా మృతిచెందాడు. శనివారం ఉదయం గిరి అంత్యక్రియలు పూర్తిచేశారు.
చదవండి: Black Fungus: బ్లాక్‌ఫంగస్‌కు ‘ఆయుర్వేదం’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement