
మణికొండ: తనను తరచూ వేధిస్తున్నాడనే కోపంతో భర్తను కూరగాయలు కోసే కత్తితో పొడిచి చంపేసింది ఓ భార్య. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి కోకాపేటలో జరిగింది. నార్సింగి ఇన్‌చార్జి సీఐ రాజేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. అసోం రాష్ట్రానికి చెందిన కృష్ణంజ్యోతి బోరా (30), బర్క బోరా భార్యాభర్తలు. బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి కోకాపేటలోని ఓ నిర్మాణ సంస్థలో పని చేస్తున్నారు. వారం రోజుల క్రితం భార్యను కొట్టి ఆమెతో గొడవ పడి ఇంట్లోంచి కృష్ణంజ్యోతి వెళ్లిపోయాడు.
గురువారం అర్ధరాత్రి మద్యం మత్తులో వచ్చి తలుపులు కొట్టినా ఆమె తీయలేదు. తలుపులను కృష్ణంజ్యోతి బలంగా తన్నటంతో ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. బర్క బోరాను కర్రతో కొట్టేందుకు యతి్నంచగా.. ఆమె పక్కనే ఉన్న కూరగాయలు కోసే కత్తితో అతనిపై దాడి చేసింది. తల, మెడ, కుడి భుజంపై కత్తితో పొడవటంతో కృష్ణంజ్యోతికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడి అరుపులు వినిపించడటంతో లేబర్ క్యాంపులో ఉన్న చుట్టు పక్కల వారు వచ్చి చూసే సరికి అతను రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు నిందితురాలు బర్క బోరాని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.