హైదరాబాద్: అన్ని ప్రధాన పార్టీలకు హేమాహేమీల్లాంటి నాయకులు ప్రచార పర్వంలో పాల్గొన్నారు. విమర్శలు, ప్రతివిమర్శలతో హోరెత్తించారు. తెలుగు రాష్ట్రాల్లోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావించారు. కానీ.. ఓటింగ్ శాతం పెరగకపోవడం విడ్డూరంగా ఉందని రాజకీయ విశ్లేషకులు, పార్టీల ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఓటింగ్ 48.49 శాతమే నమోదు కావడానికి కారణాలెన్నో కనిపిస్తున్నాయి.
కాంగ్రెస్ తరఫున సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్ పక్షాన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేపీ తరఫున కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తో పాటు ఏపీలోని బీజేపీకి చెందిన కేంద్రమంత్రులు, మన రాష్ట్ర మంత్రులు, ప్రముఖ నేతలు ప్రచారం చేసినా ఓటింగ్ 50 శాతం కూడా నమోదు కాకపోవడం గమనార్హం. సుమారు నాలుగు లక్షల ఓటర్లతో ఉన్న జూబ్లీహిల్స్‌లో ఓటింగ్ శాతం దాదాపుగా 55 శాతానికి పైగా రావచ్చనే కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ అంచనాలు వేశాయి. హేమాహేమీల ప్రచారంతో పాటు అన్ని పారీ్టలు గెలుపు ధీమాతో ఓటర్లను ఆకట్టుకోనే ప్రయత్నాలు చేశాయి.
కారణాలివీ..
గందరగోళం: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బడుగు, బలహీన వర్గాలు అధికం. ఈ ప్రాంతంలో అత్యధికంగా బస్తీలున్నాయి. కొన్ని గేటెడ్ కమ్యూనిటీలు, అపార్టుమెంట్లు, కాలనీలు ఉన్నాయి. సినిమాలు, టీవీ సీరియళ్లలో పనిచేసే టెక్నీషియన్లు, కూలీలు, వ్యాపారులు, ప్రైవేట్ ఉద్యోగులు అధికం. కానీ.. ప్రధాన సమస్య ఏమిటంటే.. ఒక కుటుంబంలో 5 ఓట్లుంటే అవి దూర ప్రాంతంలో వేర్వేరు పోలింగ్ బూత్‌లలో ఉండటం గమనార్హం. కుటుంబంతో ఇంకొకరు అదనంగా ఓటర్‌గా చేరితే అదే అడ్రస్ ఉన్నా కానీ ఓటు మాత్రం ఎక్కడో వేరేచోట పోలింగ్ బూత్‌లో ఉన్నాయి. ఒక్కోసారి గత అసెంబ్లీలో ఒక బూత్‌లో వేస్తే ఈ ఉప ఎన్నికలకు వచ్చే సరికి మరోచోట ఉండటం సమస్యగా మారింది. ఓ ప్రైవేట్ ఉద్యోగి ఉద్యోగానికి బయలుదేరి ఓటు వేద్దామని బూత్ దగ్గరకు వెళ్తే అక్కడ తన ఓటు లేదని.. మరోచోట ఉందని చెప్పడంతో సదరు వ్యక్తి అసహనానికి గురై ఓటు వేయకుండా వెళ్లిపోయిన ఘటనలున్నాయి.
చుట్టూ తిరిగి రాలేక: అంతేకాకుండా ఎర్రగడ్డలోని పలు బస్తీల్లోని వ్యక్తుల ఓట్లు వారికి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలోని డాన్‌బాస్కో స్కూల్‌లోని పోలింగ్ కేంద్రంలో ఉండటంతో వారు ఓటు వేయడానికి ముందుకు రాలేదు. 10 నుంచి 15 బూత్‌ల ఓట్లు ఒకే చోట ఏర్పాటు చేయడం ప్రధాన సమస్యగా మారింది. అదనంగా ఓటర్లు రావడానికి మధ్యలో ఉన్న పోలింగ్ బూత్‌ల దారులు పోలీసులు మూసివేశారు. దీంతో వారు ఆటోలలో రావడానికి చుట్టూ మూడు కిలోమీటర్లు తిరిగి రావాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమస్యలు ఒక్క ఎర్రగడ్డలోనే కాకుండా అన్ని డివిజన్లలో నెలకొంది.
నిరాసక్తత: అపార్ట్‌మెంట్‌వాసులు కూడా ఓటు వేయడానికి పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. ఉద్యోగాలు, వ్యాపారాల రీత్యా, పనుల నిమిత్తం బయట ఉండటంతో మనం ఓటు వేయకపోతే ఏమవుతుందిలే అనే నిరాసక్తత చూపించారు. ఇక్కడి ప్రాంతాల ప్రజలు ఓటు హక్కును పొంది, మరోచోటకు మారుతూ ఉంటున్నారు. అందులో ప్రధానంగా సినీ, చిరు వ్యాపారులు, ఉపాధి అవకశాలకోసం వచ్చే హాస్టల్ విద్యార్థులు, ఇతర రాష్ట్రాల కూలీలు అధికం. ఇలాంటి ఓట్లు కూడా వేలల్లో ఉన్నట్లు సమాచారం. ఏదేమైనా ఎంతో ప్రతిష్టాత్మకంగా, వ్యూహాత్మకంగా, భారీ ప్రచారాలకు తెరలేపినా.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటింగ్ పెరగకపోవడానికి కారణాలను మరింత లోతుగా ఈసీ విశ్లేషించాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


