హైదరాబాద్‌ మెట్రోకు వైరస్‌ బ్రేక్‌ | Virus Breaks To Metro Rail No Occupancy Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ మెట్రోకు వైరస్‌ బ్రేక్‌

Feb 4 2022 4:31 AM | Updated on Feb 4 2022 1:45 PM

Virus Breaks To Metro Rail No Occupancy Hyderabad - Sakshi

మెట్రో రైలు స్పీడుకు ఒమిక్రాన్‌ బ్రేకులు వేస్తోంది. నెల రోజులుగా మెట్రో ప్రయాణికుల సంఖ్య రెండు లక్షల మార్కు దాటడం లేదు.

సాక్షి, హైదరాబాద్‌: మెట్రో రైలు స్పీడుకు ఒమిక్రాన్‌ బ్రేకులు వేస్తోంది. నెల రోజులుగా మెట్రో ప్రయాణికుల సంఖ్య రెండు లక్షల మార్కు దాటడం లేదు. గత రెండేళ్లుగా కోవిడ్, డెల్టా, ఒమిక్రాన్‌లు వరుసగా కలల రైలు పుట్టి ముంచుతున్నాయి. నిర్మాణ వ్యయం పెరగడం, గతంలో తీసుకున్న రుణాలు వాటిపై వడ్డీలు, వాయిదాల చెల్లింపులు, నిర్వహణ వ్యయాలు, ఉద్యోగుల జీతభత్యాలు తడిసి మోపెడవుతున్నాయి. గత రెండేళ్లుగా వరుస నష్టాలతో మెట్రో సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో సుమారు రూ.5 వేల కోట్ల సాఫ్ట్‌లోన్‌ అయినా మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్మాణ సంస్థ పలుమార్లు విన్నవించినప్పటికీ ఫలితం కనిపించడంలేదు. 

ఆక్యుపెన్సీ ఎప్పటికి పెరిగేనో? 
♦ప్రస్తుతం ఎల్భీనగర్‌– మియాపూర్‌ మార్గంలో అత్యధికంగా నిత్యం సమారు లక్ష మంది జర్నీ చేస్తున్నట్లు మెట్రో వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత నాగోల్‌– రాయదుర్గం రూట్లో రోజువారీగా 80 నుంచి 90 వేలు, జేబీఎస్‌– ఎంజీబీఎస్‌ రూట్లో నిత్యం పదివేల మంది రాకపోకలు సాగిస్తున్నట్లు పేర్కొన్నాయి. కోవిడ్‌ లాక్‌డౌన్‌కు ముందు ఈ మూడు మార్గాల్లో నిత్యం 4 లక్షల మంది జర్నీ చేసేవారు.  

♦ప్రస్తుతం ఐటీ, బీపీఓ, కేపీఓ, అనుబంధ రంగాల ఉద్యోగుల వర్క్‌ ఫ్రం హోం కారణంగా ఆక్యుపెన్సీ గణనీయంగా పడిపోయింది. మెట్రో స్టేషన్లు, బోగీలను నిరంతరాయంగా శానిటైజేషన్‌ చేయడం, కోవిడ్‌ నిబంధనలను పాటించినప్పటికీ సాధారణ ప్రజానీకం మెట్రో జర్నీ కంటే వ్యక్తిగత వాహనాల వినియోగానికే మొగ్గు చూపుతుండడంతో రద్దీ ఏమాత్రం పెరగకపోవడం గమనార్హం. ప్రస్తుతం క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో మరో ఆరునెలల్లో పూర్వపు స్థాయిలో నాలుగు లక్షల రద్దీ మార్కును దాటుతుందని మెట్రోవర్గాలు ఆశిస్తున్నాయి. 

నష్టాల నుంచి గట్టెక్కని వైనం.. 
♦ మెట్రోకు గత రెండేళ్లుగా నష్టాలు వెంటాడుతున్నాయి. 2019– 20 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.383 కోట్లు, 2020– 21 ఆర్థిక సంవత్సరంలో సంస్థ రూ.1783 కోట్ల నష్టాలను చవిచూసింది. ఈ ఆర్థిక సంవత్సరం సైతం నష్టాల జర్నీ తప్పడంలేదని.. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి సుమారు రూ.5 వేల కోట్ల సాఫ్ట్‌లోన్‌ మంజూరు చేయాలని కోరుతోంది. ఇటీవలి కాలంలో మెట్రో ప్రాజెక్టులో తమ వాటా 90 శాతాన్ని ప్రభుత్వం టేకోవర్‌ చేయాలని ప్రతిపాదించినట్లు విశ్వసనీయ సమాచారం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement